ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని, బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఏఐసీసీ పార్లమెంట్ పరిశీలకులు రంగరాజన్ మోహన్ కుమార్ మంగళం అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోహన్ కుమార్ మంగళం మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు.
గ్యారంటీ పథకాలతోనే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ, మహబూబ్నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. గ్యారంటీ పథకాలను గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని కోరారు.
పట్టణంలోని పలు వార్డులకు చెందిన వారు యెన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో నాయకులు చంద్రకుమార్ గౌడ్, బురుజు సుధాకర్ రెడ్డి, సీజే బెనహర్, సిరాజ్ ఖాద్రీ, బెక్కరి అనిత, లింగంనాయక్, ఆనంద్ గౌడ్, రాఘవేందర్ రాజు, లక్ష్మణ్ యాదవ్, ఫయాజ్, అలీ, చంద్రశేఖర్, రాములు యాదవ్, ఆవేజ్, హక్, రమేశ్, నర్సింహారెడ్డి, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.