women car driving on Railway Track update: ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని కొండకల్ రైల్వే ట్రాకుపై ఓ యువతి కారు నడుపుతూ రైళ్లకు ఎదురువెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 7 కిలోమీటర్లు ఆ యువతి ట్రాకుపై కారు నడుపుకుంటూ వెళ్లింది. రైల్వే సిబ్బంది, స్థానికులు అడ్డుకుందామని ప్రయత్నించినా యువతి కారు ఆపకుండా వేగంగా దూసుకెళ్లింది. ఎట్టకేలకు ఏడు కిలోమీటర్ల తర్వాత కారును పట్టుకున్నారు. లోకో పైలట్ కారును గుర్తించి చాకచక్యంగా రైలు నిలిపివేయడంతో ప్రమాం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారు నడిపిన యువతిని యూపీకి చెందిన వోమిక సోనీగా గుర్తించారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె.. మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా మహిళా పోలీసులపై దుర్బాషలాడుతూ దాడికి దిగింది. దీంతో యువతి మానసిక స్థితి సరిగా లేదని భావించారు. అనంతరం చేవెళ్లలోని ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. యువతి మెంటల్ కండీషన్ బాగలేదని వైద్యులు స్పష్టంచేశారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో యువతికి చికిత్స అందించనున్నారు.
కాగా గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు ఏడు కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై యువతి కారు నడిపింది. దీంతో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యువతిపై పలు రైల్వే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యూపీలోని లక్నోకు చెందిన సోని సాఫ్ట్ వేర్ జాబ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. అయితే తల్లిదండ్రులతో పాటు భర్తకు ఆమె దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది.
ప్రస్తుతం నగరంలోని పుప్పాలగూడలో నివాసం ఉంటున్న సోనీ డిప్రెషన్ లో మద్యం తాగి కారును రైల్వే ట్రాక్ పై నడుపుకుంటూ వెళ్లింది. ఆత్మహత్య చేసుకోవడానికే యువతి ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించిన పోలీసులు.. చికిత్స అనంతరం విచారణకు హాజరుకావాలని సూచించారు.