Youngone’s manufacturing in Telangana : ఒకప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన వరంగల్ వస్త్ర పరిశ్రమ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కృషితో ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేస్తోంది. “మేడిన్ తెలంగాణ” అనే నినాదం ఇక కేవలం మాటలకే పరిమితం కాదు, అక్షరాలా నిజమై అంతర్జాతీయ బ్రాండ్‌గా అవతరించింది. దక్షిణ కొరియాకు చెందిన వస్త్రపరిశ్రమ దిగ్గజం ‘యంగ్‌వన్’, చారిత్రక వరంగల్ గడ్డపై తన ఉత్పత్తిని ప్రారంభించి, ఇక్కడి టీ-షర్టులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది. వేలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించనున్న ఈ బృహత్ ప్రాజెక్టు స్వరూపమేంటి? దీని భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? తెలుసుకుందాం రండి.
ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ : వరంగల్ జిల్లా సంగెం మండలం సమీపంలో సుమారు 1,357 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో, యంగ్‌వన్ సంస్థ 297 ఎకరాల్లో తన యూనిట్‌ను నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, 2029 నాటికి మొత్తం 120 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1000 కోట్లు) పెట్టుబడితో 8 ప్రాజెక్టులను నిర్మించనుంది. తొలిదశలో భాగంగా ఇప్పటికే 25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆరు భవనాల నిర్మాణం చేపట్టగా, మొదటి ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమైంది.
ప్రస్తుతం నెలకు సుమారు 10 నుండి 15 వేల టీ-షర్టులను ఉత్పత్తి చేస్తూ, వాటిని 100 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ టీ-షర్టులన్నింటిపైనా “మేడిన్ తెలంగాణ, ఇండియా” అని బ్రాండ్ ముద్రించి ఉండటం తెలంగాణ వస్త్ర ఖ్యాతిని దశదిశలా చాటుతోంది.
11,700 మందికి ఉపాధి లక్ష్యం : ఈ ప్రాజెక్టు కేవలం ఒక వస్త్ర తయారీ కేంద్రం మాత్రమే కాదు, వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక బృహత్తర యజ్ఞం. 2029 నాటికి మొత్తం 8 యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించాక, సుమారు 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. గార్మెంట్ మేకింగ్, క్వాలిటీ కంట్రోల్, స్యూయింగ్ వంటి విభాగాలతో పాటు, సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఫ్యాక్టరీ మేనేజర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా స్థానికులకు లభించనున్నాయి.
మహిళా సాధికారతకు పెద్దపీట : యంగ్‌వన్ పరిశ్రమలో అత్యంత ప్రశంసనీయమైన అంశం మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం. ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఏకంగా 90 శాతం మంది మహిళలే. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలకు కంపెనీయే స్వయంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి పనులలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వారి నైపుణ్యాన్ని బట్టి ప్రారంభ వేతనం రూ.15,000 నుంచి రూ.50,000 వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా, స్థానికంగా మహిళలను వారి వారి గ్రామాల నుంచి కంపెనీ బస్సుల్లోనే పరిశ్రమకు తీసుకువచ్చి, పని పూర్తయ్యాక సురక్షితంగా ఇళ్లకు చేర్చడం విశేషం. మహిళల సౌకర్యార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకే పని వేళలు నిర్వహిస్తున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు.. డ్రైపోర్ట్ ప్రతిపాదన : ప్రస్తుతం టీ-షర్టులను ఉత్పత్తి చేస్తున్న యంగ్‌వన్, త్వరలోనే జాకెట్లు, స్వెట్టర్లు, యోగా ప్యాంట్లు, స్పోర్ట్స్ డ్రెస్‌లు వంటివాటిని కూడా తయారు చేయనుంది. “ప్రస్తుతం స్థానిక రైతుల నుంచి కొంత పత్తిని కొనుగోలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచుతాం,” అని యంగ్‌వన్ ఇండియా హెడ్, శ్రీకాంత్ ఎస్. భమిడిపాటి తెలిపారు.
ప్రస్తుతం ఇక్కడ తయారైన ఉత్పత్తులను చెన్నై పోర్టుకు తరలించి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్తులో ఉత్పత్తి వేల రెట్లు పెరిగినప్పుడు, సరుకు రవాణాను సులభతరం చేయడానికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లోనే ఒక డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరగా, సానుకూల స్పందన లభించినట్లు తెలిసింది. ఇది కార్యరూపం దాల్చితే, వరంగల్ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడం ఖాయం.


