ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్(Anvesh)పై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్న వారిపై వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైళ్ల మీద బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై కూడా ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారులు దాన కిషోర్, వికాస్ రాజ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
దీంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్‌పై హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా తనపై కేసు నమోదు కావటంపై అన్వేష్ స్పందించారు. తాను రెండు నెలలుగా బెట్టింగ్ యాప్‌ల నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అవగాహన కల్పిస్తున్నానని తనపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా తనపై ఎలా కేసు పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు.