YS Sharmila : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వాలని కోరుతూ షర్మిల ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం ఆమరణ దీక్షకు దిగారు. హైకోర్టు పాదయాత్రను అనుమతించాలని అని చెబుతున్నప్పటికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని దీక్ష చేపట్టారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు.
శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా..? అంటూ షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. కేసీఆర్ పదే పదే తప్పులు చేస్తున్నారు. ఇదే కేసీఆర్ పతనానికి నాంది అని షర్మిల అన్నారు.