తెలుగు సాహిత్యాకాశంలో యువభారతి వెలుగు దివ్వెలు ధృవతారలుగా వెలుగుతున్నారని వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సూర్య ధనుంజయ్ అన్నారు. యువభారతి తెలుగు భాషా సాహిత్యాల ప్రచారం కోసం ఎంతో కృషి చేస్తోందని ఆమె చెప్పారు. నగరంలోని ఐఐఎంసి కళాశాల ప్రాంగణంలో యువభారతి, రసమయి సంస్థ, ఐఐఎంసి కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు వెలుగు సమాఖ్య ద్వితీయ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాల కరపత్రాన్ని ఆచార్య సూర్య ధనుంజయ్
ఆవిష్కరించారు. తెలుగు సాహిత్య విద్యార్థినిగా తాను యువభారతిని దగ్గరగా చూశానని, ఆ సంస్థ అద్భుతమైన గ్రంథాలను ప్రచురించిందని, వాటిలో మహంతి చాలా గొప్ప మహత్తు కలిగిన గ్రంథమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అవధాన ప్రక్రియ గురించి మరుమాముల దత్తాత్రేయ శర్మ ప్రసంగించారు. యువభారతి అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర అధ్యక్షతన తెలుగు భాషా సాహిత్యాల వైభవం అనే అంశంపై కవి సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమంలో యువభారతి కార్యదర్శి జీడిగుంట, ఐఐఎంసి కళాశాల ప్రిన్స్ పాల్ కె. రఘువీర్, అధ్యాపకురాలు కళ్యాణి, డాక్టర్ ఎస్. నారాయణరెడ్డి, అక్కిరాజు సుందర రామకృష్ణ, సత్కళాభారతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు