HomeTelangana Rising 2047GREEN ENERGY POLICY : హరిత విద్యుత్తు.. తెలంగాణ 'క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ'...

GREEN ENERGY POLICY : హరిత విద్యుత్తు.. తెలంగాణ ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ’ పాలసీ-2025 విడుదల!

Telangana Clean and Green Energy Policy : బొగ్గు ఆధారిత విద్యుత్తుతో వాతావరణ కాలుష్యం, భూతాపం వంటి పెను ప్రమాదాలు ముంచుకొస్తున్న వేళ, తెలంగాణ ప్రభుత్వం ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది. థర్మల్ విద్యుత్తుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, హరిత విద్యుత్తు ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో, “తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025″ని ప్రకటించింది. 

- Advertisement -

విద్యుత్తు అన‌గానే.. దేశంలో చాలావ‌ర‌కు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలే క‌నిపిస్తాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో సింహ‌భాగం ఈ థ‌ర్మ‌ల్ విద్యుత్తే ఉంటోంది. అయితే దీనివ‌ల్ల క‌ర్బ‌న ఉద్గారాలు పెరిగిపోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, భూతాపం (గ్లోబ‌ల్ వార్మింగ్‌) ఎక్కువ కావ‌డం లాంటి విప‌రిణామాలు ఎన్నో ఉన్నాయి. అందుకే.. క్ర‌మంగా ఈ థ‌ర్మ‌ల్ విద్యుత్తు మీద ఆధార‌ప‌డ‌డం త‌గ్గించి హ‌రిత విద్యుత్తును ఉత్ప‌త్తి చేయాల‌న్న ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వం 2025 జ‌నవ‌రి 11న “తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎన‌ర్జీ పాల‌సీ” పేరుతో ఒక విధానాన్ని ప్ర‌క‌టించింది. ఇది నోటిఫికేష‌న్ ఇచ్చిన తేదీ నుంచి ప‌దేళ్ల పాటు అమ‌లులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పున‌రుద్ధ‌ర‌ణీయ విద్యుత్ అభివృద్ధి కార్పొరేష‌న్ (టీజీ రెడ్కో) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్ప‌త్తి కార్పొరేష‌న్ (టీజీ జెన్‌కో)ల‌ను ఈ పాల‌సీ అమ‌లుకు నోడ‌ల్ ఏజెన్సీలుగా నియ‌మించారు.  

ల‌క్ష్యం ఇదీ : రాష్ట్రానికి ఇంధ‌న భ‌ద్ర‌త క‌లిగేలా చూడ‌డం, న‌మ్మ‌ద‌గిన భ‌రించ‌ద‌గిన విద్యుత్తును అందించ‌డం ఈ పాల‌సీ ప్ర‌ధాన ల‌క్ష్యం.  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాల‌న్నింటికీ స‌రిప‌డ విద్యుత్తు ఉత్ప‌త్తి కోసం స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని, సుస్థిర‌త కొన‌సాగించాల‌ని, అదే స‌మ‌యంలో పున‌రుద్ధ‌ర‌ణీయ విద్యుత్ ప్రాజెక్టుల‌ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా సౌర‌, ప‌వ‌న, ఇంధ‌న నిల్వ ప్రాజెక్టుల‌ను వేగ‌వంతంగా అమ‌లు చేస్తారు. ఈ విధానంలో భాగంగా ఇంధ‌న నిల్వ ప‌రిష్కారాల‌ను ప్రోత్స‌హించ‌డం, హ‌రిత హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తిని అభివృద్ధి చేయ‌డం, ఉత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర‌చ‌డం, రాష్ట్రమంతా ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించ‌డానికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో దృష్టిపెట్టింది. 

పాల‌సీలో ప్ర‌ధాన అంశాలు
సౌర విద్యుత్ ప్రాజెక్టులు : మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), గ్రామ సంస్థలు, రైతులు, సహకార సమితులు, పంచాయతీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), నీటి వినియోగదారుల సంఘాల (డ‌బ్ల్యుయూఏలు) స్థాపించిన సదుపాయాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయడం ద్వారా గ్రిడ్-స్థాయి, భూమ్మీద ఏర్పాటుచేసిన‌, డీసెంట్రలైజ్డ్ సౌర ప్లాంట్ల‌ను ప్రోత్సహిస్తుంది.

ఇళ్ల‌మీద సౌర ఫ‌ల‌క‌లు : గృహాలు, ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, ఇత‌ర కార్యాల‌యాలు, ప్రైవేటు క‌ర్మాగారాలతో పాటు, ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కంలో క‌ట్టిన ఇళ్ల మీద సౌర ఫ‌ల‌క‌లు పెట్ట‌డం ద్వారా విద్యుత్ స్వ‌యం స‌మృద్ధి సాధించ‌డం. ఇలాంటి ప్రాజెక్టుల‌కు 100% నెట్ ఎస్‌జీఎస్‌టీని రీయింబ‌ర్స్ చేయాల‌ని నిర్ణ‌యం.  

పంప్డ్ స్టోరేజ్ ప‌వర్ ప్లాంట్లు : తెలంగాణ‌లో విస్తృతంగా ఉన్న భూభాగం, సింగ‌రేణి కాల‌రీస్ సంస్థ మూసేసిన గ‌నుల్లో పంప్డ్ స్టోరేజ్ ప‌వ‌ర్ (పీఎస్పీ) ప్లాంట్ల‌కు విస్తృతంగా అవ‌కాశం ఉంది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. పీఎస్పీల అభివృద్ధి కోసం కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. వీటిలో 3400 మెగావాట్ల ప్లాంటుకు స‌న్ పెట్రో, 1500 మెగావాట్ల ప్లాంటుకు మెయిల్‌తో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పీఎస్పీల అభివృద్ధి కోసం త‌గిన స్థలాల అన్వేష‌ణ‌కు టీజీ జెన్‌కో ప్రీ-ఫీజిబులిటీ స్ట‌డీ కూడా మొద‌లుపెట్టింది. 

సౌర‌, ప‌వ‌న బ్యాట‌రీ ఉత్ప‌త్తి ప్రోత్సాహ‌కాలు : సౌర విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తుకు అవ‌స‌ర‌మైన బ్యాట‌రీల‌ను ఉత్ప‌త్తి చేసే సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం అనేక ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింది. ముందుగా పెట్టుబ‌డి రాయితీలు, ఎస్జీఎస్టీ రీయింబ‌ర్స్‌మెంట్‌, విద్యుత్ సుంకం మిన‌హాయింపులు, ట్రాన్స్‌మిష‌న్‌/వీలింగ్ ఛార్జీలను తిరిగి చెల్లించ‌డం లాంటి రాయితీలు ఈ సంస్థ‌ల‌కు ల‌భిస్తాయి. దీంతోపాటు మ‌హిళ‌ల నేతృత్వంలో నిర్వ‌హించే సంస్థ‌లు స్థానికుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేవాటికి అద‌నంగా ర‌వాణా రాయితీలు, స్టాంపు డ్యూటీ రీయింబ‌ర్స్‌మెంట్‌, మెగా ప్రాజెక్టుల‌కు ఆక‌ర్ష‌ణీయ ధ‌ర‌ల‌కు భూములు ఇవ్వ‌డం లాంటి ప్రోత్సాహ‌కాలు అందిస్తారు. 

ఇత‌ర పున‌రుద్ధ‌ర‌ణీయ విద్యుత్ ప్రాజెక్టులు : జియోథ‌ర్మ‌ల్‌, మినీ-హైడ‌ల్, చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి, బ‌యోఇంధ‌న ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గిన విధంగా స‌హ‌కారం అందిస్తుంది. 

బ‌యో ఇంధ‌నం : కంప్రెస్డ్ బ‌యోగ్యాస్ (సీబీజీ), 2జీ ఇథ‌నాల్ ప్లాంట్ల‌కు పెట్టుబ‌డి రాయితీలు, ప‌న్ను తిరిగి చెల్లింపు, విద్యుత్ టారిఫ్ మ‌ద్ద‌తు, వ‌డ్డీ స‌బ్‌వెన్ష‌న్‌, విద్యుత్ సుంకం మాఫీ లాంటి ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు ఏర్పాటుచేసే ప్లాంట్లు, అలాగే స్పెష‌ల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల‌లో ఏర్పాటుచేసే ప్లాంట్ల‌కు అద‌న‌పు వ‌డ్డీ స‌బ్‌వెన్ష‌న్ కూడా క‌ల్పిస్తున్నారు.  

పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న హైబ్రిడ్ ప్రాజెక్టులు : ఇంధ‌న వేరియ‌బులిటీని త‌గ్గించ‌డానికి, మౌలిక సదుపాయాల వాడకాన్ని ఆప్టిమైజ్ చేయడానికి పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న హైబ్రిడ్ ప్రాజెక్టులు (ఉదాహరణకు, సౌర + ప‌వ‌న‌, ప‌వ‌న‌ + ఫ్లోటింగ్ సౌర), నిల్వ చేయ‌గ‌ల పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న ప్రాజెక్టులకు (ఉదాహరణకు, ప‌వ‌న‌ + నిల్వ, హైబ్రిడ్ + నిల్వ)  ప్రోత్సాహం. 

విద్యుత్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ స్వాపింగ్‌ : 2030 నాటికి రాష్ట్రంలో 6 వేల, 2035 నాటికి 12 వేల ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని, వాటితో పాటు బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్ల‌నూ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో స‌హ‌కారం లేదా పీపీపీ ప‌ద్ధ‌తి అవ‌లంబించాల‌ని యోచిస్తోంది. 

గ్రీన్ హైడ్రోజ‌న్ : ఎలక్ట్రోలైజ‌ర్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, సమీకృత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ సదుపాయాలు, హైడ్రోజన్ రీఫ్యూయ‌లింగ్ స్టేషన్ల కోసం 30% వరకు మూలధన సబ్సిడీ అందిస్తుంది. ఎలక్ట్రోలైజ‌ర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ ప్లాంట్లకు కూడా మూలధన సబ్సిడీలు అందిస్తారు. మహిళల నేతృత్వంలోని సంస్థలు, హ‌రిత‌ ఉత్పత్తి విధానాలు, స్థానికుల‌కు ఉద్యోగాలు క‌ల్పించేవారికి అద‌న‌పు ప్రోత్సాహ‌కాలు కూడా క‌ల్పిస్తారు. 

పున‌రుద్ద‌ర‌ణీయ ఇంధ‌న ప్రాజెక్టుల‌కు ప్రోత్సాహం : సౌర, ప‌వ‌న‌, బీఈఎస్ఎస్, గ్రీన్ హైడ్రోజ‌న్ లాంటిపునరుద్ధ‌ర‌ణీయ‌ విద్యుత్తు ఉత్ప‌త్తి చేసే సంస్థ‌ల‌కు ప‌లు ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తున్నారు. వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర భూమిగా సుల‌భంగా మార్పు చేసుకోవ‌డం విద్యుత్తు సుంకాల మిన‌హాయింపు, ల్యాండ్ సీలింగ్ ప‌రిమితి ఎత్తివేత‌, స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు, సుల‌భ‌త‌ర అనుమ‌తుల విధానం లాంటివి ఉంటాయి. 

ఆవిష్క‌ర‌ణ‌లు, ఆంత్ర‌ప్రెన్యూర్లు : పునరుత్పాదక విద్యుత్తు ఉత్ప‌త్తి రంగంలో వినూత్నతను ప్రోత్సహించడానికి టీజీ ట్రాన్స్‌కో/టీజీ డిస్కంల‌లో  రూ.50 కోట్ల నిధులతో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్ స్టార్టప్‌లు, విద్యాసంస్థ‌లు, పరిశ్రమలతో కలిసి పనిచేసి వినూత్న ఇంధ‌న పరిష్కారాలను అభివృద్ధి చేయడం వాటిని విస్తరించడానికి ఆంత్ర‌ప్రెన్యూర్ల‌ను ప్రోత్స‌హిస్తుంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News