HomeతెలంగాణFunds: పల్లె ప్రగతికి నిధుల పండగ.. తెలంగాణకు రూ. 9,968 కోట్లు కేటాయించిన 16వ ఆర్థిక...

Funds: పల్లె ప్రగతికి నిధుల పండగ.. తెలంగాణకు రూ. 9,968 కోట్లు కేటాయించిన 16వ ఆర్థిక సంఘం

16th Finance Commission funds for Telangana : పల్లె సీమల ప్రగతి రథచక్రాలు పరుగులు తీయనున్నాయి. తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల రూపురేఖలు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధుల వరద పారించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి ఏకంగా రూ. 9,968 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే, ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించకుండా, కేవలం పల్లెల అభివృద్ధికే సద్వినియోగం చేసుకునేలా కేంద్రం ‘లక్ష్మణ రేఖ’ గీసింది. నిధుల ఖర్చు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పకడ్బందీ మార్గదర్శకాలను జారీ చేసింది. 

- Advertisement -

అభివృద్ధికి ‘ఆర్థిక’ ఊతం – లెక్కల పక్కా ఇలా : కేంద్ర 16వ ఆర్థిక సంఘం 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలకు ఏకంగా రూ. 4,35,236 కోట్లను గ్రాంట్ల రూపంలో (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేనివి) మంజూరు చేసింది. ఈ కేటాయింపుల్లో పారదర్శకత కోసం జనాభా, విస్తీర్ణాన్ని ప్రామాణికంగా తీసుకుంది. 2026 నాటి అంచనా ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి 10 శాతం వెయిటేజీ ఇచ్చింది. ఈ లెక్కన తెలంగాణలోని గ్రామీణ జనాభాకు 1.92 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 0.37 శాతం చొప్పున మొత్తం మీద రూ. 9,968 కోట్లను తెలంగాణకు కేటాయించింది.

Also Read: https://teluguprabha.net/top-stories/ktr-says-24-hour-drinking-water-will-be-provided-in-hyderabad-once-brs-comes-to-power/

నిబంధనల ఉక్కుపాదం – దారి మళ్లింపునకు చెక్ : గతంలో కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఈసారి మార్గదర్శకాలను కేంద్రం కఠినతరం చేసింది.
నిర్దేశిత అవసరాలకే (Tied Funds): ఈ నిధులను కేవలం మౌలిక సదుపాయాల కల్పన, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ రహదారులు, వీధి దీపాల ఏర్పాటుకు మాత్రమే వెచ్చించాలి.
జీతాలకు నో: ఈ గ్రాంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సిబ్బంది వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకు ఉపయోగించరాదు.
రోడ్లకు పరిమితి: అన్‌టైడ్ (నిర్దేశించని) నిధులలో 20 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం వెచ్చించడానికి వీల్లేదు.

పంపిణీ తీరు – పనితీరుకే పట్టం : నిధులు సక్రమంగా పల్లెలకు చేరేందుకు స్పష్టమైన యంత్రాంగాన్ని కేంద్రం సూచించింది. ప్రతి సంవత్సరం రెండు సమాన విడతల్లో (జూన్, అక్టోబర్ నెలల్లో) నిధులు విడుదలవుతాయి. మొత్తం నిధుల్లో గ్రామ పంచాయతీలకు 80 శాతం, మండల ప్రజా పరిషత్‌లకు 10 శాతం, జిల్లా ప్రజా పరిషత్‌లకు 10 శాతం చొప్పున పంపిణీ చేస్తారు.
రాజ్యాంగంలోని 9వ భాగం ప్రకారం సక్రమంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు మాత్రమే ఈ నిధులు సాఫీగా అందుతాయి.

Also Read: https://teluguprabha.net/telangana/ias-amoy-kumar-to-be-questioned-by-ed-in-money-laundering-case/

10 రోజుల నిబంధన: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గ్రాంట్లు చేరిన వెంటనే, కేవలం 10 పని దినాల్లోగా వాటిని సంబంధిత స్థానిక సంస్థల ఖాతాలకు బదిలీ చేయాలి.
20 శాతం ప్రోత్సాహకం: గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లు, సొంత ఆదాయ వనరుల పెంపుదల, మరియు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సమకూరుస్తున్న నిధుల పనితీరు ఆధారంగా 20 శాతం నిధుల విడుదలను కేంద్రం నిర్ణయిస్తుంది.

పారదర్శకత, జవాబుదారీతనం – ఆడిటింగ్ తప్పనిసరి : నిధుల వినియోగంలో పైసా పైసాకు లెక్క చెప్పాల్సిందేనని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. మొదటి విడత నిధులు కావాలంటే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను కేంద్రానికి సమర్పించాలి. వాటి వినియోగ ధ్రువీకరణ (UC) ఇస్తేనే రెండో విడత విడుదలవుతుంది. ఖర్చు వివరాలను ఇ-గ్రామ్‌స్వరాజ్ (e-GramSwaraj) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. గ్రామ సభలు, మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో తీర్మానం చేసిన తర్వాతే నిధులు వాడాలి. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఆడిట్‌లో లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దాలి. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News