HomeతెలంగాణRtc Bustands: బస్టాండ్‌లకు కార్పొరేట్ లుక్.. 13 ప్రాంతాల్లో ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’ విధానం

Rtc Bustands: బస్టాండ్‌లకు కార్పొరేట్ లుక్.. 13 ప్రాంతాల్లో ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’ విధానం

  • ప్రయాణంతో పాటు వినోదం, షాపింగ్‌కు  ప్రాధాన్యం
  • వ్యాపారులకు షాపులు, బిజినెస్‌ కాంప్లెక్స్‌ల కేటాయింపులు
  • ప్రకటించిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (తెలుగుప్రభ): మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తన రూపురేఖలను సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా.. వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’ విధానంలో 13 నూతన హైటెక్‌ బస్‌ స్టేషన్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించినట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎండీ వై. నాగిరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌,  రేగొండ, హుజూర్‌నగర్‌, కోదాడ, కొడంగల్‌, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్‌, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెంలో నూతన హైటెక్‌ బస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
రైల్వే, ఇతర రవాణాతో అనుసంధానం
నూతన బస్‌ స్టేషన్లను ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందించేలా తీర్చిదిద్దనున్నారు. బస్సు దిగిన వెంటనే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునేలా మల్టీ-మోడల్‌ కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌ స్థాయి సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో బస్టాండ్‌ అంటే కేవలం బస్సు కోసం వేచి ఉండే ప్రదేశంగా కాకుండా.. పలు అవసరాలు ఒకే చోట తీరే ప్రయాణ ప్రాంగణంగా రూపుదిద్దుకోనుంది.
మల్టీప్లెక్స్‌ తరహాలో హంగులు
గతంలో బస్టాండ్లకు ఉండే ఇరుకు ప్రదేశాలు, అసౌకర్యాలకు స్వస్తి పలికేలా కొత్త బస్‌ స్టేషన్లను ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదంగా గడిపేందుకు గేమింగ్‌, ఫుడ్‌కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. మల్టీప్లెక్స్‌ తరహా వాతావరణంతో ప్రయాణికులకు వినోదం, ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. నూతన హైటెక్‌ బస్టాండ్లలో వాణిజ్య కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు షాపులు, బిజినెస్‌ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాలకు కమర్షియల్‌ స్పేస్‌ కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో షాపులు, బిజినెస్‌ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది.  త్వరలోనే ఈ మోడల్‌ బస్‌ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News