- కమిటీ నివేదిక, సిఫార్సుల ఆధారంగా తుది నిర్ణయం
- 128 మంది కార్మికుల సమస్యపై సమగ్ర పరిశీలన
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ సమర్పించే నివేదిక, సిఫార్సుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సోమవారం శాసనమండలిలో వెల్లడించారు. 1990వ దశకం నుంచి, ముఖ్యంగా 1997 నుంచి ఈ సమస్య సింగరేణిలో కొనసాగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. అధికారిక రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా, వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒకరి పేరుతో మరొకరు ఉద్యోగం చేయడం నేరపూరిత అంశమే అయినప్పటికీ, కార్మికుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో సింగరేణి యాజమాన్యం మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నించిందని వివరించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు అప్పట్లో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
90 వేల మంది ఉద్యోగులు
ప్రస్తుతం సింగరేణిలో సుమారు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ‘మారుపేర్ల’ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కేవలం 128 మాత్రమేనని భట్టి విక్రమార్క తెలిపారు. చట్టపరమైన చిక్కులు ఉండటంతో అధికారులు ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఏళ్ల తరబడి సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఏ ఒక్క అధికారిపైనా వ్యక్తిగతంగా భారం పడకుండా కమిటీ ద్వారా ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కమిటీ నివేదిక అందిన అనంతరం 128 మంది కార్మికుల ‘మారుపేర్ల’ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

