Friday, February 13, 2026
HomeతెలంగాణCORRUPTION : రవాణా శాఖలో 'ధన'నాయక్.. డీటీసీ కిషన్ ఇంట్లో రూ.200 కోట్ల అక్రమాస్తులు!

CORRUPTION : రవాణా శాఖలో ‘ధన’నాయక్.. డీటీసీ కిషన్ ఇంట్లో రూ.200 కోట్ల అక్రమాస్తులు!

ACB raids on Telangana transport official : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో, మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏకకాలంలో 12 చోట్ల జరిపిన మెరుపు దాడుల్లో, లెక్కల్లో చూపని కిలోల కొద్దీ బంగారం, భూముల పత్రాలు, ఖరీదైన భవనాలకు సంబంధించిన దస్త్రాలు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ ఏకంగా రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసలు ఈ అవినీతి అధికారి బాగోతం ఎలా బయటపడింది? ఏసీబీ సోదాల్లో వెలుగుచూసిన పూర్తి ఆస్తుల చిట్టా ఏమిటి?

- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై, ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని కిషన్ నాయక్ స్వగృహంతో పాటు, మహబూబ్‌నగర్‌లోని ఆయన కార్యాలయం, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో మొత్తం 12 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

బయటపడ్డ అక్రమాస్తుల చిట్టా : ఈ సోదాల్లో అధికారులు కళ్లు చెదిరేలా అక్రమాస్తులను గుర్తించారు. నారాయణఖేడ్‌లో 30 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు. నిజామాబాద్‌లో ‘లహరి ఇంటర్నేషనల్ హోటల్’, పలు అపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన దస్త్రాలు.పాట్ మార్కెట్‌లోని అజిత్ గోల్డ్ దుకాణంలో కిషన్ నాయక్ పేరిట ఉన్న ఒక కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న బంధువు విజయ్ ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు.

అధికారుల మాట : ఈ దాడులపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
డాక్యుమెంట్ల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ రూ.12 కోట్లకు పైగా ఉంది. కానీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండవచ్చని మా ప్రాథమిక అంచనా. కిషన్ నాయక్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించాం. అతన్ని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తాం.”
– శ్రీధర్, డీఎస్పీ, ఏసీబీ

రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి వద్ద ఇంతటి భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడటం శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News