Homeతెలంగాణఆదిలాబాద్Adilabad: జిల్లాను తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలి.. మాజీ మంత్రి జోగు రామన్న

Adilabad: జిల్లాను తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలి.. మాజీ మంత్రి జోగు రామన్న

  • రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
  • మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్ ప్రతినిధి (తెలుగు ప్రభ): ఆదిలాబాద్ జిల్లాను తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పత్తి రైతులకు ఎకరాకు రూ.25 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల పరిహారం అందించాలని, ఫసల్ బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుండగా, రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో చేపట్టాల్సిన ముందస్తు చర్యలను ఆలస్యంగా చేపట్టడం, హడావుడిగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో రైతులు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం 991 మిల్లీమీటర్లు కాగా, వర్షపాతం గణనీయంగా తగ్గిపోయిందని, 31 శాతం లోటు నమోదైందని పేర్కొన్నారు. ఫసల్ బీమా పథకం పరిధిలోకి వస్తున్న రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నప్పటికీ ఫసల్ బీమా పథకాన్ని ఎత్తివేసిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెనగంటి ప్రకాష్, చందాల రాజన్న, కుమ్రా రాజు, వెంకటేష్,కొండ గణేష్, ఆప్కామ్ గంగయ్య, దమ్మాపాల్,పవన్ నాయక్, దాసరి రమేష్, దయానంద్, దివిటి రాజు. మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News