Homeతెలంగాణఆదిలాబాద్Buddhism : భక్తితో బుద్ధ వందనం.. భైంసాలో బౌద్ధోపాసకుల సందడి

Buddhism : భక్తితో బుద్ధ వందనం.. భైంసాలో బౌద్ధోపాసకుల సందడి

ముథోల్ (తెలుగు ప్రభ) : నిర్మలమైన మనస్సు, ధర్మబద్ధమైన జీవన విధానం మానవ వికాసానికి మూలస్తంభాలు. సమాజంలో శాంతి, సద్భావన వెల్లివిరియాలంటే తథాగతుని మార్గమే శరణ్యమని నిరూపిస్తూ భైంసా పట్టణంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం స్థానిక టెక్డి ప్రాంతంలోని బుద్ధ విహార్‌లో నిర్వహించిన ‘బుద్ధ వందన’ కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, మహిళలు, యువత పెద్దఎత్తున తరలివచ్చి నీరాజనాలు పలికారు. 

- Advertisement -

దీపధూప పూజలతో ఆధ్యాత్మిక పరిమళం : కార్యక్రమంలో భాగంగా ముందుగా గౌతమ బుద్ధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు ప్రత్యేక దీపధూప పూజలు నిర్వహించారు. త్రిశరణాలు, పంచశీల ప్రార్థనలతో విహార ప్రాంగణం మార్మోగింది. బుద్ధుని శాంతి మార్గం, అంబేద్కర్‌ సామాజిక ఆశయాలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అష్టాంగ మార్గం, నాలుగు ఆర్య సత్యాలు, పది పారమితాలను నిష్ఠతో ఆచరించాలని ఉద్బోధించారు.

యువతకు సన్మార్గ బోధ.. ధ్యానంతోనే మనశ్శాంతి : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం నిత్యం ధ్యానం (విపశ్యన) అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత చెడు సావాసాలకు, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పష్టం చేశారు. బైంసా పట్టణంలోని వివిధ వార్డులతో పాటు పరిసర గ్రామాల నుంచి బౌద్ధ కుటుంబాలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.

జాతీయ కరాటే విజేతకు ఘన సత్కారం : ఈ వేదికగా క్రీడారంగంలో ప్రతిభ చాటిన స్థానిక యువకుడిని గౌరవించారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కాంస్య పతకం సాధించి పట్టణ ఖ్యాతిని చాటిన అనిల్ కరండే కుమారుడు సమ్యక్‌ను బుద్ధ విహార్ టీం సభ్యులు ఘనంగా సన్మానించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతరం దేశానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

అన్నదానం.. విహార్‌ అభివృద్ధికి పిలుపు : అనంతరం అంబేద్కర్ నగర్ వాసి గడపాలే రమేష్ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బుద్ధ విహార్ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఉపాసకుడు తమ వంతు ఆర్థిక, నైతిక సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు. అందరి ఐక్యత, భాగస్వామ్యంతోనే విహారాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News