Homeతెలంగాణఆదిలాబాద్Asifabad: రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.. డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

Asifabad: రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు.. డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

ఆసిఫాబాద్‌ (తెలుగుప్రభ ): పోలీసు శాఖ సమర్థవంతమైన పనితీరుకు రికార్డుల నిర్వహణ కీలకమని కాళేశ్వరం మల్టీజోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

- Advertisement -

రికార్డుల నిర్వహణపై సమీక్ష..

జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణను పరిశీలించిన డీఐజీ.. పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (డీసీఆర్‌బీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నేరాల రికార్డులు, కేసుల వివరాలు, నేరస్థుల సమాచారం, పెండింగ్‌ కేసులకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు.

డీపీఓలోని ఏ, బీ సెక్షన్లతో పాటు ఫింగర్‌ప్రింట్‌, డీ4సీ, కమాండ్‌ కంట్రోల్‌ విభాగాలను తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల తీరు, కార్యాలయ పనితీరును సమీక్షించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ క్రమపద్ధతిలో భద్రపరచాలని ఆదేశించారు. కేసులు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పులు లేకుండా నమోదు చేయాలని, అవసరమైనప్పుడు తక్షణమే అందుబాటులో ఉండేలా డేటాను నిర్వహించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రికార్డుల నిర్వహణలో నాణ్యత, కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పెండింగ్‌ రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..

పోలీస్‌ కార్యాలయంలో పరిశుభ్రత, క్రమశిక్షణ, ఫైళ్లు, రికార్డుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఐజీ సూచించారు. సిబ్బంది తమకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల పనితీరును సమీక్షించి, పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఉచిత పోలీస్‌ నియామక శిక్షణ శిబిరాన్ని సందర్శించి శిక్షణ పొందుతున్న 160 మంది అభ్యర్థులతో మాట్లాడారు. వారి శిక్షణ, పరీక్షలకు సంబంధించిన సన్నద్ధత వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్‌, ఏఎస్పీ (అడ్మిన్‌) చిత్తరంజన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ (అడ్మిన్‌), డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News