Homeతెలంగాణఆదిలాబాద్Asifabad: స్నానం చేయలేదని మందలించిన కుటుంబ సభ్యులు.. బావిలోకి దూకిన బాలిక

Asifabad: స్నానం చేయలేదని మందలించిన కుటుంబ సభ్యులు.. బావిలోకి దూకిన బాలిక

Asifabad: ‘స్నానం చేయి’ అని కుటుంబ సభ్యులు మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడంది. ఈ ఘటన ఆసిఫాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి బాలికను సురక్షితంగా బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

- Advertisement -

బావిలో దూకి కేకలు: ఆసిఫాబాద్‌లోని సందీప్‌నగర్‌కు చెందిన స్వర్ణలత, పోచీరాంల కుమార్తె సాత్విక ఇటీవల ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. అయితే బుధవారం సాయంత్రం స్నానం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు ఆమెను కాస్త గట్టిగా మందలించారు. కుటుంబ సభ్యుల మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన సాత్విక.. వెంటనే పక్క వీధిలోని బజార్‌వాడిలో ఉన్న ఒక బావి వద్దకు వెళ్లి అందులోకి దూకేసింది. నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై ‘100’నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్: సమాచారం అందిన వెంటనే ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఫైటర్‌ నరేష్, ఫైర్‌మెన్‌ రాము, డ్రైవర్ ప్రవీణ్‌కుమార్‌లు తాడు, రక్షణ పరికరాలతో రంగంలోకి దిగారు. ఫైర్‌మెన్‌ రాము ప్రాణాలకు తెగించి తాడు సహాయంతో బావిలోకి దిగారు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలికకు లైఫ్‌ జాకెట్‌ తొడిగారు. అనంతరం సిబ్బంది సహాయంతో బాలికను సురక్షితంగా బావి పైకి తీసుకొచ్చారు.

Also read-Telangana: భానుడి ప్రచండ రూపం.. 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత!

ఆసుపత్రికి తరలింపు: బావిలో పడటం వల్ల బాలిక కాలికి స్వల్ప గాయమైంది. దీంతో తక్షణమే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని కాలనీవాసులు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News