Homeతెలంగాణఆదిలాబాద్Machkal: ప్రతి నీటి బొట్టుకు భద్రత.. వేసవి నీటి ఎద్దడికి ముందస్తు చెక్

Machkal: ప్రతి నీటి బొట్టుకు భద్రత.. వేసవి నీటి ఎద్దడికి ముందస్తు చెక్

  • మచ్కల్‌లో జలసంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
  • డ్రైనేజీ కాలువల చివర ఇంకుడు గుంతల ఏర్పాటు

ముథోల్, (తెలుగుప్రభ): భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే లక్ష్యంతో ముథోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో జలసంరక్షణ చర్యలు చేపడుతున్నారు. డ్రైనేజీ కాలువల్లో ప్రవహించే నీరు వృథాగా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఈ చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

డ్రైనేజీ నీటితో భూగర్భ జలాల పెంపు…

గ్రామంలోని డ్రైనేజీ కాలువల చివరి భాగాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఆత్మస్వరూప్ తెలిపారు. కాలువల్లో ప్రవహించే నీటిని ఈ గుంతల ద్వారా భూమిలోకి ఇంకింపజేయడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇప్పటి నుంచే జలసంరక్షణ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

el nino
el nino

నీటి వృథా నివారణకు ప్రత్యేక ప్రణాళిక…

గ్రామంలోని తాగునీటి మోటార్ల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే మోటార్లు నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా నీటి వృథాను అరికట్టి, అవసరానికి అనుగుణంగా నీటిని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే జలసంరక్షణ…

నీటి సంరక్షణలో గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ ఆత్మస్వరూప్ కోరారు. తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామస్తులందరూ సమన్వయంతో ముందుకు వచ్చి జలసంరక్షణ కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న ఈ చర్యలు భవిష్యత్తులో నీటి కొరతను తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు.

Also Read:Brain Stacking: బుర్రకు బ్రేక్ ఇవ్వండి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News