ముథోల్, (తెలుగు ప్రభ): రహదారులపై సోయా పంటను ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ముథోల్ సీఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు. స్థానిక సర్కిల్ పరిధిలోని రహదారులపై ఆరబెట్టిన సోయా పంటను ఆయన పరిశీలించారు.
కోత కోసిన సోయా పంటను రహదారులపై కాకుండా పొలాలు, ఖాళీ స్థలాలు, ఇతర అనువైన ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారిపై ఉన్న పంట వాహనదారులకు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పంటను తప్పించే క్రమంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.
రహదారులపై పంటలను ఆరబెట్టి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైతులు రహదారులపై పంటలు ఆరబెట్టకుండా సహకరించాలని కోరారు.

