Homeతెలంగాణఆదిలాబాద్Building : భవనాల లేమి.. బాధ్యతల భారమి: తలమడుగు పాలనకు తప్పని తిప్పలు

Building : భవనాల లేమి.. బాధ్యతల భారమి: తలమడుగు పాలనకు తప్పని తిప్పలు

తలమడుగు ( తెలుగు ప్రభ ) : ‘ఇల్లు కట్టి చూడు.. ఇల్లాలు చేసి చూడు’ అంటారు పెద్దలు. కానీ, ప్రజల ముంగిటకే పారదర్శక పాలన అందిస్తామంటున్న ప్రభుత్వ శాఖలకే సొంత గూడు కరువైతే? ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో నేడు నెలకొన్న దుస్థితి ఇదే. ప్రజాసేవలు పరుగులు పెట్టాల్సిన చోట.. శాశ్వత పైకప్పు లేక ప్రభుత్వ యంత్రాంగం అద్దె పంచన బిక్కుబిక్కుమంటోంది. స్థలాలు సిద్ధంగా ఉన్నా భవనాలు నిర్మించకపోవడానికి నిధుల లేమి కారణమా లేక పాలకుల ఉదాసీనతా?

- Advertisement -

శిథిలావస్థలో వ్యవసాయం.. స్థలమున్నా అద్దె కొంపలోనే డిపో : మండల బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ డీఆర్ (సివిల్ సప్లైస్) డిపో ఏళ్లుగా అద్దె గదిలోనే నెట్టుకొస్తోంది. స్థల పరిశీలనలు జరిగినా నిర్మాణం మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. మరోవైపు రైతన్నకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రాణసంకటంగా మారింది. మండల గ్రంథాలయం కూడా సొంత గూడు లేక ఏళ్ల తరబడి మూలనపడింది.

అద్దె గదుల్లో అంగన్‌వాడీలు.. నిలిచిన గ్రామ సమాఖ్యలు : మండల కేంద్రంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా సరైన తాగునీరు, పారిశుధ్యం, ఆటస్థలం లేక చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు 75 స్వయం సహాయక సంఘాలకు ప్రాతినిధ్యం వహించే రెండు గ్రామ సమాఖ్యలకు (VO) భవనాలు లేక మహిళలు చెట్ల కిందో, వరండాల్లోనో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు వచ్చి స్థలాలను చూసి వెళ్లడమే తప్ప పురోగతి శూన్యం.

ప్రభుత్వ శాఖలు అద్దె పంచన కాలం వెళ్లదీస్తుంటే సామాన్యుడికి సత్వర సేవలు అందడం గగనమవుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తలమడుగు మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News