Amit Shah calls to Bandi Sanjay: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై బీజేపీ హై కమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. బండి సంజన్‌ని బర్తరఫ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. బండి సంజయ్‌ని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండటంతో కేంద్ర నాయకత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి, బండి సంజయ్‌కి స్వయంగా ఫోన్ చేసి అత్యవసరంగా వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also read: Railway Jobs : పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
రేపు ఉదయం ఢిల్లీకి బండి సంజయ్..!
అమిత్ షా నుండి పిలుపు వచ్చిన వెంటనే స్పందించిన బండి సంజయ్, గురువారం ఉదయం విమానంలో ఢిల్లీకి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కొడుకు చుట్టూ ముసురుకున్న ఈ వివాదం, ఆపై పోలీసుల విచారణ, సిట్ ఏర్పాటు వంటి పరిణామాలతో బండి సంజయ్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాతో జరిగే ముఖాముఖి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఫోన్ కాల్ వెనుక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాత్ర ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో భగీరథ్ ఎపిసోడ్ కారణంగా పార్టీ ప్రతిష్టకు జరుగుతున్న నష్టం, ప్రతిపక్షాల విమర్శలు, ఇక్కడి తాజా రాజకీయ పరిస్థితులపై రాంచందర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించారు. రాంచందర్ రావు తెలంగాణలోని గ్రౌండ్ రిపోర్టును అందించిన వెంటనే, అమిత్ షా తీవ్రంగా స్పందించి బండి సంజయ్‌ని లైన్‌లోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భగీరథ్ ఎపిసోడ్‌ను పార్టీ పరంగా గాక, చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధిష్టానం సీరియస్‌గా యోచిస్తోంది.
Also read: Liquor price: ఇకపై కిక్కుకు ఖర్చెక్కువ.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఏ బ్రాండుపై ఎంతంటే?
రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్..
మరోవైపు, ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బీజేపీని ఎండగడుతోంది. కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్ తన పదవిలో కొనసాగితే, ఆయన కుమారుడిపై జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా సాగదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నా, విచారణ సజావుగా సాగాలన్నా బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ హైకమాండ్‌ని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ కీలకంగా మారింది. బండి సంజయ్ రాజీనామాపై సస్పెన్స్ నెలకొంది.

