Sunday, February 8, 2026
HomeతెలంగాణAnil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav On Budget: 2026-27 బడ్జెట్‌లో తెలంగాణను తీవ్ర అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజ్యసభలో పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ, తడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపుతో పాటు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరుగుతున్న నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే కోరుతున్నప్పటికీ, తడిచెర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ, నిర్ణయం తీసుకుని ఉంటే, దానికి సంబంధించిన స్థితి, కాలపరిమితి, విధివిధానాలను సభకు తెలియజేయాలని కోరారు. ఒకవేళ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆలస్యానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించాలన్నారు. తడిచెర్ల కోల్ బ్లాక్ వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రస్తావించిన ఎంపీ, ఈ బ్లాక్‌ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇంధన భద్రత బలోపేతం అవుతుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరింతగా పెరుగుతుందని, బాహ్య బొగ్గు వనరులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

- Advertisement -

తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం..

అదే విధంగా, కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ ప్రజలు దీనిపై పెద్ద ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నెరవేరలేదని తెలిపారు. ముసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) స్థాపన, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–II, ప్రాంతీయ రింగ్ రోడ్ (ట్రిపుల్‌ఆర్‌) వంటి కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం తెలంగాణ అభివృద్ధి ప్రాధాన్యతల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని వ్యాఖ్యానించారు. సహకార సమాఖ్య భావనను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన, సమతుల్యమైన బడ్జెట్ మద్దతు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సమగ్ర, స్థిరమైన అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News