- అన్నదాత గుండెల్లో గుబులు..!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలు
- ఆశలతో పెట్టిన పెట్టుబడి.. ఆందోళన మిగుల్చుతున్న వైనం
- అన్నదాత కళ్లలో ఆనందం నిండేనా?
- వర్షాకాలం సాగుపై ప్రత్యేక కథనం!
- ఆకాశం వైపు పంట సాగు ముంగిట రైతన్నల ఎదురుచూపులు
- గెలుపోటముల మధ్య నలిగిపోతున్న బతుకులు!
అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ 04 (తెలుగు ప్రభ): పెదవి విప్పితే కష్టాల కన్నీటి కథే.. భూమిని నమ్ముకుంటే అప్పుల పాలే!.. నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి మండలాల పల్లెల్లోకి వెళితే ఏ రైతు నోట విన్నా ఇదే ఆవేదన వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో కురిసిన వర్షాలు అన్నదాతల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ఇన్నాళ్లూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని భావించిన రైతన్నకు, ప్రస్తుతం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పెట్టుబడుల భారంతో అల్లాడిపోతున్న అన్నదాతల వ్యథలపై తెలుగు ప్రభ ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, చండ్రుగొండ, దమ్మపేట మండలాల్లో అన్నదాతలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆశలతో ప్రారంభించిన సాగు ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెడుతుండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెరిగిన పెట్టుబడులు, రకరకాల తెగుళ్ల దాడి, చివరి దశలో సాగునీరు అందక పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో పల్లెల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
తడిసి మోపెడవుతున్న పెట్టుబడులు..
మండల వ్యాప్తంగా ఈ ఏడాది వరి, పత్తి, మిర్చి సాగుపై రైతులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కీలకమైన దశలో వాతావరణం సహకరించడం లేదు. విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ట్రాక్టర్‌తో దుక్కి దున్నడం నుంచి కూలీల ఖర్చుల వరకు ప్రతిదీ రెట్టింపు కావడంతో ఎకరానికి అయ్యే ఖర్చు అంచనాలను మించుతోంది.
తెగుళ్ల బెడద, కోతులు.. నిండా మునుగుతున్న రైతన్న..
మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా పంటలపై రకరకాల పురుగులు, తెగుళ్లు విరుచుకుపడుతున్నాయి. వీటిని నివారించేందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన పురుగుమందులను విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అయినప్పటికీ తెగుళ్లు తగ్గక పెట్టుబడితో సహా మొత్తం నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక చేతికి వచ్చిన పంట నేలపాలవుతోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు..
గ్రామాల్లో సమస్యలు తిష్టవేసినా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమను ఆదుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల ఉచ్చులో పడి నకిలీ మందులు కొని మరింత మోసపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి, తక్షణమే గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించాలని.. నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని అన్నదాతలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

