Friday, March 13, 2026
HomeతెలంగాణTelangana Municipal Polls: మున్సిపల్ పోరులో 'పవర్' పంచ్.. కమలానికి జనసేనాని దన్ను!

Telangana Municipal Polls: మున్సిపల్ పోరులో ‘పవర్’ పంచ్.. కమలానికి జనసేనాని దన్ను!

Pawan Kalyan Telangana Campaign : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. గల్లీలో గులాబీ, కమలం, హస్తం పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోరులో సరికొత్త రాజకీయ అస్త్రం దూసుకువస్తోంది. ప్రచార పర్వంలో ప్రధాన ఘట్టానికి తెరలేపుతూ.. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ప్రచార శంఖారావం పూరించనున్నారు. ఏపీలో కూటమి విజయం తర్వాత తొలిసారిగా తెలంగాణలో రాజకీయ పర్యటన చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ జనసేనాని షెడ్యూల్ ఏంటి? ఏయే ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు? కమల దళానికి పవన్ రాక ఎంత బలాన్నివ్వనుంది? ఈ ఆసక్తికర పరిణామాలపై ప్రత్యేక కథనం..

- Advertisement -

రంగంలోకి జనసేనాని – ఖరారైన తేదీలు : తెలంగాణ పురపాలక ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 7 మరియు 9 తేదీల్లో పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ప్రచారం మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సాగనుంది.

కూటమి ధర్మం – కమల వికాసం : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో (బీజేపీ-టీడీపీ-జనసేన) భాగంగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అదే మైత్రీ బంధాన్ని తెలంగాణలోనూ కొనసాగిస్తూ, ఇక్కడి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృషి చేయనున్నారు. పవన్‌కు తెలంగాణలో, ముఖ్యంగా యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను ఓట్లుగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

రూట్ మ్యాప్‌పై కసరత్తు : పవన్ పర్యటనకు సంబంధించి నిర్దిష్టమైన రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు తుదిరూపు దిద్దుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, నిజామాబాద్ లేదా కరీంనగర్ వంటి కీలక పట్టణాల్లో ఆయన రోడ్ షోలు లేదా బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జనసేన పార్టీ త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది.

కేడర్‌లో నయా జోష్ : గత కొంతకాలంగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ, పవన్ రాకతో కార్యకర్తల్లో, ముఖ్యంగా ‘పవర్ స్టార్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీ శ్రేణులతో కలిసి జనసేన కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనేలా సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News