న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 (తెలుగుప్రభ): తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక గొల్లల గుడి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, నిర్మాణ వారసత్వానికి ప్రసిద్ధి చెందిందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 31న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ హోదా కల్పించినట్లు భారత పురావస్తు సర్వే అధికారులు తెలిపారు. కాకతీయుల నిర్మాణ శైలికి అద్దం పట్టేలా ఉన్న గొల్లల గుడి త్రికూటాలయ నిర్మాణంలో ఉంటుంది. ఆలయంలో తూర్పు ముఖంగా ఒక మండపం ఉండగా.. దాని చుట్టూ మూడు గర్భగుడులు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో కనిపించే శిల్పాలు, వాస్తు నైపుణ్యం కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారక చిహ్నంగా గుర్తింపు పొందడంతో ఇకపై ఈ ఆలయాన్ని 1958 నాటి పురావస్తు స్మారకాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం కింద పరిరక్షించనున్నారు. ఆలయ సంరక్షణ, నిర్వహణతో పాటు సందర్శకులు క్రమబద్ధంగా సందర్శించేలా ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ చేపట్టనుంది. రామప్ప ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి మరో ముఖ్యమైన నిర్మాణ వారసత్వానికి అధికారిక రక్షణ లభించడంతో తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Mulugu: ‘గొల్లల గుడి’కి జాతీయ హోదా.. రామప్ప ఆలయం సమీపంలోని అద్భుత శిల్పకళకు గుర్తింపు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

