Friday, March 13, 2026
HomeతెలంగాణMedaram: మేడారం జాతరలో "ఏఐ" నిఘా.. ప్రతి కదలికపై పోలీసుల డేగ కన్ను!

Medaram: మేడారం జాతరలో “ఏఐ” నిఘా.. ప్రతి కదలికపై పోలీసుల డేగ కన్ను!

AI security at Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈసారి భద్రత సరికొత్త హంగులు అద్దుకుంది. కోట్లాదిగా తరలివచ్చే భక్తుల రక్షణ కోసం పోలీస్ శాఖ కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను రంగంలోకి దించింది. అత్యాధునిక ఏఐ కెమెరాలు, హీలియం బెలూన్ డ్రోన్లు, జియోట్యాగ్ విధానంతో జాతర ప్రాంగణాన్ని అభేద్యమైన కోటగా మార్చారు.

- Advertisement -

ఏఐ కెమెరాలతో పటిష్ట నిఘా: జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు ‘మేడారం 2.0’ పేరుతో ములుగు ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వ్యవస్థను రూపొందించారు. ఇందులో భాగంగా ‘TG-QUEST’ అనే ప్రత్యేక ఏఐ(AI ) డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. సక్సెస్ సీసీటీవీ సేల్స్ అండ్ సర్వీసెస్ సహకారంతో పోలీసులు జాతర పొడవునా ప్రత్యేక ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో మేడారం చుట్టపక్కల గల అటవీ ప్రాంతాలను, జంపన్నవాగు, ఆలయ పరిసరాలు మరియు ప్రధాన రహదారులను ఈ డ్రోన్లు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఎక్కడైనా జనసాంద్రత పెరిగితే ఏఐ ద్వారా ముందే గుర్తించి కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి. తద్వారా తొక్కిసలాట వంటి ప్రమాదాలను నివారించవచ్చు.

Also read-Medaram: మేడారంలో నేడు కీల‌క ఘ‌ట్టం.. గిరిజన ఆచారాలతో అష్టదిగ్బంధనం!

300 మీటర్ల ఎత్తు నుండి నిఘా.. హీలియం బెలూన్ డ్రోన్లు: జాతరలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సరికొత్తగా హీలియం బెలూన్ డ్రోన్లను ప్రవేశపెట్టారు. ఏఐ కెమెరాలు కేవలం వాహనాల నంబర్లనే కాకుండా, వ్యక్తుల ముఖాలను కూడా స్పష్టంగా చిత్రీకరిస్తాయి. రాత్రి వేళల్లో కూడా పనిచేయడం వీటి ప్రత్యేకత. భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ బెలూన్లు నిరంతరం లైవ్ ఫీడ్‌ను అందిస్తాయి. వీటిలో ఇప్పటికే నిక్షిప్తం చేసిన పాత నేరస్తులు, అనుమానితుల డేటా ఆధారంగా.. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే వారి ఫోటోలను తీసి కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపిస్తాయి. సాధారణ డ్రోన్ల కంటే ఇవి ఎక్కువ సమయం ఒకే చోట ఉండి పర్యవేక్షించగలవు. అంతే కాకుండా జాతరలోకి ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది భక్తులు వెళ్తున్నారనే లెక్కలను ఈ కెమెరాలు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి.

తప్పిపోతే ఇట్టే పట్టేయవచ్చు.. జియోట్యాగ్ టెక్నాలజీ: గతంలో వేల సంఖ్యలో భక్తులు తప్పిపోయిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని వొడాఫోన్-ఐడియా సహకారంతో మేడారంలో ప్రవేశపెట్టారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్ల వద్ద పిల్లలు, వృద్ధుల వివరాలు నమోదు చేసి, వారికి క్యూఆర్‌ కోడ్ ఉన్న జియోట్యాగ్‌లను కడతారు. ఒకవేళ వారు తప్పిపోయినా, ఆ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి కుటుంబ సభ్యుల వివరాలను త్వరగా తెలుసుకోవచ్చు.

Also read-Medaram: మేడారం మహాజాతరలో తొలి అంకం షురూ.. భక్తిశ్రద్ధలతో ‘గుడి మెలిగే’ పండుగ!

కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ: మేడారం గద్దెల వద్ద ఏర్పాటు చేసిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుండి పోలీస్‌ ఉన్నతాధికారులు నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో 24/7 పర్యవేక్షణ కొనసాగుతోంది. ఒక్కో కెమెరా వంద మంది పోలీసులు చేసే పనిని చేస్తోందని.. తద్వారా భద్రత మరింత సమర్థవంతంగా ఉందని అధికారులు వెల్లడించారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతి భక్తుడు సురక్షితంగా దర్శనం చేసుకునేలా సాంకేతికతను గరిష్టంగా వినియోగిస్తున్నామని పోలీస్ యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News