Balka Suman: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
భారీ బందోబస్తు మధ్య అరెస్ట్: ఇటీవల సింగరేణి సంస్థను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై సదరు అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం యాక్షన్‌లోకి దిగారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్‌లో ఉన్న సుమన్‌ను భారీ బందోబస్తు నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టును నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు తెలంగాణ భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అర్ధరాత్రి కోర్టులో హాజరు: అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన అధికారులు.. దాదాపు ఆరున్నర గంటల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి దాటిన తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో బాల్క సుమన్‌ను ప్రవేశపెట్టగా.. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం: బాల్క సుమన్ అరెస్టును బీఆర్‌ఎస్ అధిష్టానంతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. “ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య. ప్రభుత్వ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు ఈ ఘటనే నిదర్శనం.” అని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

