Bandi Bhagirath Surrender: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకు శనివారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. విచారణకు హాజరు కావాలని మూడ్రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించకపోగా ఆయన పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో.. న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ సరెండర్ అయ్యారు.
Also Read: https://teluguprabha.net/telangana/key-update-on-bandi-bhagirath-pocso-case/
కాగా, ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ తరఫు న్యాయవాదులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన విచారణలో హైకోర్టు వెకేషన్ బెంచ్ భగీరథ్‌కు ముందస్తు బెయిల్, అరెస్టుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న భగీరథ్ కోసం పోలీసులు ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో భగీరథ్ కుటుంబీకులు స్వయంగా వచ్చి పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి తమ వాంగ్మూలాలను అధికారికంగా రికార్డు చేశారు.
తన కుమారుడు లొంగిపోవడంపై బండి సంజయ్ స్పందించారు. చట్టంపై గౌరవంతోనే తన కొడుకు భగీరథ్‌ను పోలీసులకు అప్పగించానని తెలిపారు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని.. అతనే స్వయంగా న్యాయవాదుల సమక్షంలో పేట్‌బషీరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. ‘మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. ఫిర్యాదు రాగానే స్టేషన్‌లో అప్పగిద్దామనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత ఆలస్యం జరిగింది.’ అని బండి సంజయ్ వివరించారు.

