Bandi Sanjay approach City Civil Court: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో కొందరు కావాలనే పనిగట్టుకొని తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో వాడకుండా వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో స్పష్టం చేశారు. బండి సంజయ్ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు వాడొద్దని.. అలా వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసులో బండి సంజయ్ పేరును వాడొద్దంటూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. మరోవైపు, బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలన్నింటినీ డిలీట్ చేయాలని, అలా చేయని మీడియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/telangana/kalvakuntla-kavitha-sensational-comments/
వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు..
మరోవైపు, బండి భగీరథ్ కేసులో మైనర్ బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫొటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. పలువురు సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు.

