Bandi Sanjay counters KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌లా దోచుకోవడం.. దాచుకోవడం తమకు తెలియదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టించారని గుర్తు చేశారు. అలా హింసించడం తమకు తెలియదన్నారు. అంతేకాదు, మీలా డ్రగ్స్ తీసుకోవడం కూడా తనకు తెలియదని కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీలా కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేస్ కేసు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేయడం కూడా తెలియదని హాట్ కామెంట్స్ చేశారు. ఇకనైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయి ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినప్పటికీ కేటీఆర్‌లో మార్పు రావడం లేదని.. ఇంకా అదే అహంకారం కనిపిస్తుందని విమర్శించారు.
Also Read: https://teluguprabha.net/national-news/suvendhu-adhikari-as-cm-of-west-bengal/
మోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి..
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు, బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులిస్తోందని గుర్తు చేశారు. కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. ఢిల్లీ నుండి మేం నిధులు తెస్తుంటే.. కాంగ్రెసోళ్లు తెలంగాణ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్మును వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం మోడీ వస్తున్నారని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేయడమే మోడీ నినాదం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

