- అధికారం పోయినా బీఆర్ఎస్ అహంకారం పోలేదు
- గుంటూరులో చదివిన కేటీఆర్ కు ఏం తెలుసు.. తెలంగాణ ప్రజల కష్టాలు
- కడుపులో కుల్లు.. పేద పిల్లలపై ద్వేషంతో ఆ కుటుంబం కుట్ర
- జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా భవిష్యత్తే కాంగ్రెస్ లక్ష్యం
- విద్యాశాఖపై ప్యాషన్‌తోనే నా దగ్గర పెట్టుకున్నా
- దేశానికే ఆదర్శంగా నూతన విద్యా పాలసీ
- 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకం.. విద్యా బడ్జెట్ రూ.26,647 కోట్లు
- పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటైజేషన్ ప్రసక్తే లేదు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పేటెంట్
- గత ప్రభుత్వం రూ.5,430 కోట్ల బకాయిలు
- జెన్యూన్ కాలేజీలకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్
- విద్యార్థుల కోసమే పథకం.. యాజమాన్యాల కోసం కాదు
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (తెలుగుప్రభ): ‘రాత్రయితే బార్లు.. పొద్దున్న దర్బార్లు.. ఇదే వాళ్ల కల్చర్. అధికారం పోయినా బీఆర్ఎస్ అహంకారం పోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ ప్రజల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. పేద పిల్లల భవిష్యత్తుపై కడుపులో కుళ్లు, ద్వేషంతో బీఆర్‌ఎస్ కుటుంబం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జెన్‌జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశానికే ఆదర్శంగా నిలిచే నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యా వ్యవస్థపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. విద్యాశాఖపై తనకు ఉన్న ప్యాషన్‌తోనే ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నానని రేవంత్ తెలిపారు. ‘‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుంది’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి అవినీతి, ఆరోపణలకు తావులేకుండా 55 రోజుల్లోనే 10,006 మంది ఉపాధ్యాయులను నియమించిందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించారని విమర్శించారు. మూడేళ్లలో విద్యా బడ్జెట్‌ను రూ.7,554 కోట్లు పెంచి రూ.26,647 కోట్లకు చేర్చామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం కేటాయించడమే లక్ష్యమన్నారు.
ప్రత్యేక విద్యా కమిషన్
ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందిస్తామని సీఎం చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, దాని నివేదికను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో కమిటీని నియమించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేలు పెరగడం సంస్కరణలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు నిదర్శనమన్నారు. 4,100 పాఠశాలల్లో 64 వేల మంది పిల్లలకు ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నామని, విద్యార్థిపై ఏటా సగటున రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి రూ.927 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ లేదు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రేవంత్ స్పష్టం చేశారు. వాటిని యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఈవీలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు అనుగుణంగా కోర్సులు, ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు కల్పిస్తామని చెప్పారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం కూడా ప్రైవేటీకరణ కాదన్నారు. టాటా సహకారంతో శిక్షణ ఇస్తున్నామని, విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఏటీసీల కోసం 282 ఎకరాల భూమిని కేటాయించామని, ఒక్కో కేంద్రంపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని రేవంత్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,430 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని, తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,488 కోట్లు చెల్లించిందని తెలిపారు. జెన్యూన్ కళాశాలలకు మాత్రమే రీయింబర్స్‌మెంట్ ఇస్తామని, అది విద్యార్థుల కోసమే తప్ప యాజమాన్యాల కోసం కాదని స్పష్టం చేశారు.
కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు
గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలియవని సీఎం అన్నారు. పేదల మధ్య పెరిగిన తనకు వారి సమస్యలు తెలుసన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా రియల్ ఎస్టేట్‌లోనే ఉండి ఉంటే వేల కోట్లు సంపాదించి ఉండేవాడినని, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి విమర్శను తిప్పికొడుతూ.. ముఖ్యమంత్రి స్వయంగా శాఖను పర్యవేక్షించడం దానికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు.
విద్యార్థులు రాజకీయ ఉచ్చులో పడొద్దు
విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని రేవంత్ సూచించారు. ‘‘వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకుంటారు.. పేద పిల్లలకు మంచి విద్య అందిస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు అధికారం కోల్పోయిన బాధనే తెలంగాణ ప్రజల బాధగా భావిస్తున్నారని విమర్శించారు. ఫామ్‌హౌస్ కుట్రలు తెలంగాణలో ఇక చెల్లవని అన్నారు. పేద పిల్లల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకుండా విద్యా సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం కోరారు.

