HomeTop StoriesConnectivity : దశాబ్దాల నిరీక్షణకు తెర.. భద్రాచలానికి నేరుగా రైలు ప్రయాణం!

Connectivity : దశాబ్దాల నిరీక్షణకు తెర.. భద్రాచలానికి నేరుగా రైలు ప్రయాణం!

Bhadrachalam Malkangiri new railway line project : దక్షిణ అయోధ్యగా, కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రానికి దశాబ్దాల తరబడి ఊరిస్తున్న “నేరుగా రైలు ప్రయాణం” కల ఎట్టకేలకు సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రకటించిన “పాండురంగాపురం – భద్రాచలం – మల్కన్‌గిరి” నూతన రైల్వే లైనుతో ఈ ప్రాంత రూపురేఖలే మారబోతున్నాయి.

- Advertisement -

160 కి.మీ. వేగం – లెవెల్ క్రాసింగ్‌లు లేని అద్భుత ఇంజనీరింగ్ : ఈ నూతన రైల్వే ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో డిజైన్ చేశారు. రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో అత్యంత వేగంగా దూసుకెళ్లేలా ట్రాక్ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రైలు ప్రయాణ వేగానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లైను మొత్తంలో ఒక్క చోట కూడా లెవెల్ క్రాసింగ్ లేకుండా రూపుదిద్దుతున్నారు.

300 వంతెనలు.. గోదావరిపై భారీ రైల్వే బ్రిడ్జి : ఈ ప్రాజెక్ట్ పరిధిలో మౌలిక వసతుల నిర్మాణం అత్యంత అద్భుతంగా సాగనుంది. మొత్తం 173.6 కిలోమీటర్ల పరిధిలో 300కు పైగా చిన్న, పెద్ద వంతెనలు నిర్మిస్తారు. వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా 41 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBs), 66 రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUBs) అందుబాటులోకి రానున్నాయి. భద్రాచలం సమీపంలో జీవనది గోదావరిపై నిర్మించనున్న భారీ రైల్వే వంతెన ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా, ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలవనుంది.

భూసేకరణ బడ్జెట్ అంచనాలు : తెలంగాణ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), ఆంధ్రప్రదేశ్ (అల్లూరి సీతారామరాజు జిల్లా – చింతూరు, కూనవరం ప్రాంతాలు), ఒడిశా (మల్కన్‌గిరి జిల్లా) ల పరిధిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గం కోసం మొత్తం 843.9 హెక్టార్ల భూమి సేకరణ చేయాల్సి ఉంటుందని రైల్వే శాఖ గుర్తించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు  అటవీ భూములు భాగమై ఉన్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,864 కోట్లుగా నిర్ణయించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు’ హోదా కల్పించడంతో పనులు శరవేగంగా జరగనున్నాయి.

శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తులకు నేరుగా రైలు బాట : ఇప్పటివరకు భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చేది. ఈ నూతన మార్గం పాండురంగాపురం నుంచి నేరుగా భద్రాచలం పట్టణానికి చేరుకుంటుంది. ఫలితంగా దేశంలోని వివిధ మూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రాచలానికి నేరుగా రైలు కనెక్టివిటీ లభిస్తుంది.

సరకు రవాణాలో విప్లవాత్మక మార్పు – కీలక కారిడార్ : ఈ మార్గం కేవలం ప్రయాణికులకే కాక, దేశీయ పారిశ్రామిక రంగానికి జీవగర్రగా మారనుంది. ప్రస్తుతం తీవ్ర రద్దీతో ఉన్న వరంగల్ – విజయవాడ – విశాఖపట్నం – భువనేశ్వర్ ప్రధాన రైల్వే మార్గానికి ఇది అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. దక్షిణ భారతదేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వేగంగా బొగ్గును రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది. ఒడిశా ప్రాంతం నుంచి ఇనుము, అల్యూమినియం, బొగ్గు వంటి ఖనిజ పరిశ్రమల లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను తూర్పు, ఉత్తర భారత మార్కెట్లకు వేగంగా చేరవేసేందుకు వీలవుతుంది. పాండురంగాపురం వద్ద ప్రారంభమై గోదావరి నదిని దాటి, భద్రాచలం, చింతూరు, కూనవరం అటవీ ప్రాంతాల మీదుగా ఒడిశాలోని మల్కన్‌గిరి చేరుకునే ఈ డ్రీమ్ ప్రాజెక్టును ఐదేళ్ల వ్యవధిలో (2031 నాటికి) పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News