Bhadradri Kothagudem airport hurdles : భద్రాద్రి రామయ్య చెంత విమానాల రొద వినాలని.. బొగ్గు గనుల జిల్లా గగన మార్గంలో పరుగులు పెట్టాలని.. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల, కలగానే మిగిలిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నా, నిధులు సిద్ధంగా ఉన్నా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. కొండలు, గుట్టలు, రిజర్వ్ ఫారెస్టులు.. ఇలా ప్రకృతి సిద్ధమైన అడ్డంకులే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శాపంగా మారాయి. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు పట్టాలెక్కడం లేదు..? అధికారుల ముందున్న సవాళ్లేంటి..?
పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఇక్కడి బొగ్గు గనులకు, పరిశ్రమలకు, ముఖ్యంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి రాకపోకలు సులభతరం చేయాలన్నది దీని ఉద్దేశం.
అడుగడుగునా అడ్డంకులే : అయితే, ఈ ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిబంధనల ప్రకారం, అనువైన భూమిని గుర్తించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
కొండలు, గాలి దిశ: చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో 954 ఎకరాల భూమిని గుర్తించినా, అక్కడ ఉన్న కొండలు, గాలి వీచే దిశ విమానాల రాకపోకలకు అనువుగా లేవని కేంద్ర బృందాలు తేల్చిచెప్పాయి.
రిజర్వ్ ఫారెస్ట్: జిల్లాలో మెజారిటీ భూభాగం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటంతో, భారీగా భూసేకరణ చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.
వరద ముప్పు: గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో, వరద ముంపు లేని ఎత్తైన ప్రదేశాన్ని గుర్తించడం కష్టతరమవుతోంది.
సింగరేణి గనులు: జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి గనులు కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అవరోధంగా మారుతున్నాయి. ఇటీవల టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో పరిశీలించినా, అవే భౌగోళిక అడ్డంకులు ఎదురవడంతో, కథ మళ్లీ మొదటికొచ్చింది.
రామగుండంలోనూ ఇదే పరిస్థితి : ఇదే తరహా సమస్యలు రామగుండం విమానాశ్రయ ప్రతిపాదనకు కూడా ఎదురవుతున్నాయి. కేటాయించిన స్థలానికి ఇరువైపులా గుట్టలు, మరోవైపు హై-టెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో, AAI అధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఆదిలాబాద్, మామునూరుపై ఆశలు : ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాలపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఈ రెండు చోట్ల విమానాశ్రయాలను నిర్మిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.40.53 లక్షల నిధులను కూడా విడుదల చేసింది. ఈ అధ్యయన నివేదికలు వచ్చిన తర్వాతే, ఈ విమానాశ్రయాల భవితవ్యం తేలనుంది.

