HomeతెలంగాణKamareddy: బిచ్కుందలో మరో అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగ అరెస్ట్

Kamareddy: బిచ్కుందలో మరో అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగ అరెస్ట్

కామారెడ్డి, అక్టోబర్ 11 (తెలుగు ప్రభ): కామారెడ్డి జిల్లాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగలను దొంగిలిస్తున్న ముఠాకు చెందిన మరో అంతర్రాష్ట్ర నిందితుడిని బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా జరి ప్రాంతం భుయ్ గల్లీకి చెందిన సత్నామ్ సింగ్ చందూ సింగ్ బావరి (39)ను అక్టోబర్ 11న ఫట్లపూర్ శివారులోని రాజస్థాన్ ధాబా సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

- Advertisement -

గోపన్‌పల్లి శివారులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి, అందులోని రాగి తీగలు, బుష్ రాడ్లు, విద్యుత్ నూనెను అపహరించిన ఘటనపై విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్ సోలేటి పవన్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. బిచ్కుంద సీఐ రవికుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ గౌడ్, ఎస్సై రాజు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు.

19 చోరీ కేసుల్లో ప్రమేయం

పోలీసుల విచారణలో సత్నామ్ సింగ్ తన బావమరిది షంషేర్ సింగ్‌తో కలిసి కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సత్నామ్ సింగ్‌కు మొత్తం 19 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇదే ముఠాకు చెందిన షంషేర్ సింగ్‌ను భిక్నూర్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

చోరీలకు ప్రత్యేక పద్ధతి

నిందితులు చోరీలకు వెళ్లే ముందు సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేవారని పోలీసులు తెలిపారు. తిరిగి వచ్చిన తర్వాతే వాటిని ఆన్ చేసేవారని వెల్లడించారు. సైకిల్ ట్యూబ్ సహాయంతో రంపపు బ్లేడ్‌ను పొడవాటి కర్రకు కట్టి, విద్యుత్ సరఫరాను నిలిపివేసిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్లను కిందకు దించేవారని వివరించారు. అనంతరం స్పానర్లు, కట్టర్లతో వాటిని విడదీసి రాగి తీగలను అపహరించేవారని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీలకు ఉపయోగించిన హోండా యునికార్న్ ద్విచక్ర వాహనం, వివో వై39 5జీ మొబైల్ ఫోన్, టార్చ్‌లైట్, స్క్రూడ్రైవర్, కట్టర్, కటింగ్ ప్లయర్, సుత్తి, పొడవాటి ఇనుప రాడ్‌తో పాటు రాగి కాయిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బిచ్కుంద సీఐ రవికుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ గౌడ్, ఎస్‌హెచ్‌ఓ గుండెల రాజు, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, గణపతి, ఐటీ కోర్ బృందం సభ్యులు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, మోహన్‌లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News