Big shock for KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు బిగ్ షాకిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సిట్ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. విచారణ నిమిత్తం నందినగర్‌లోని నివాసంలో అందుబాటులో ఉండాలని ఆయనకు సూచించారు. అయితే, తాను ప్రస్తుతం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే నివసిస్తున్నందున, అక్కడే విచారణ చేయాలని కేసీఆర్ సిట్ అధికారులను విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేసీఆర్‌కు సిట్ అధికారులు జనవరి 29 (గురువారం) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని సిట్ ఏసీపీ వెంకటగిరి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు కాపీని సిట్ అధికారులు.. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి, అక్కడి సిబ్బందికి అందజేశారు. దీంతో,కేసీఆర్ సిట్ అధికారుకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే తనను విచారించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిట్ సమయం ఇస్తామంటూ తొలుత చెప్పింది. అయితే, కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. ఇవాళ (శుక్రవారం) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, ఫిబ్రవరి 1న విచారిస్తామని నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించారు.
కేటీఆర్, హరీష్‌రావు విచారణ పూర్తి..
ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కూడా సిట్ అధికారులు విచారించారు. జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు హరీశ్‌రావును సుమారు 7 గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలు, నిధుల వినియోగం, ఎన్నికల సమయంలో పోలీసుల ద్వారా జరిగిన నగదు పంపిణీ ఆరోపణలపై ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా జనవరి 23న సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయాల కోసం ఎలా వాడుకున్నారనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. విచారణ అనంతరం దీనిపై స్పందించిన కేటీఆర్ ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. అబద్ధపు కేసులతో తమను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు నిలవదని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

