Big shock for non-veg lovers: తెలంగాణలో కోడి ధర కొండెక్కి కూర్చుంది. ఓవైపు ఎండలతో వాతావరణం ఉక్కపోస్తుంటే.. చికెన్ చెమటలు పట్టిస్తోంది. మూన్నెళ్ల క్రితం భారీగా పెరిగిన చికెన్ ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. గత పది రోజుల్లో ఏకంగా కిలో చికెన్ ధర రూ.100 వరకు పెరగడం నాన్ వెజ్ ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. వారం క్రితం వరకు హైదరాబాద్ లో కిలో స్కిల్ లెస్ చికెన్ ధర రూ.240 ఉండగా.. ఇప్పుడు కేజీ చికెన్ రూ. 350 నుంచి 370 వరకు పలుకుతోంది. ఫామ్‍లలో లైవ్ చికెన్ కేజీ రూ. 170 నుంచి రూ. 180 వరకు ఉండగా గుడ్ల ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో డజన్ కోడి గుడ్ల ధర రూ. 72 నుంచి 75 కు చేరుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/polycet-students-must-follow-these-steps/
ఎండ తీవ్రత తట్టుకోలేక కోళ్లు మృత్యువాత..
అయితే, ఇలా అకస్మాత్తుగా ధర పెరగడానికి కారణంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎండల తీవ్రతే అని చెప్పవచ్చు. పెరుగుతున్న ఎండ తీవ్రత ఫౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వడగాల్పుల కారణంగా ఫారాల్లోని కోళ్లు ఆహారం సరిగా తీసుకోవడం లేదని, ఎండ వేడిమి తట్టుకోలేక పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని ఫౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా డిమాండ్‌కు సరిపడ ఉత్పత్తి లేక ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. వీటికి తోడు రవాణా ఖర్చులు సైతం భారంగా మారాయని దీంతో ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే వారం కేజీ చికెన్ ధర రూ. 400 మార్కును దాటే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చికెన్ ధరలు ఆకాశానంటుతుండటంతో మాంసం ప్రియులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అటు, మటన్ రేటు కూడా భారీగా ఉండటంతో చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.

