BRS Muncipalities Incharges KTR: తెలంగాణలో ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ సమాయత్తమైంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ప్రత్యేక సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జ్‌లను) నియమించింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలో జోరు మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే.. పుర పోరును సైతం ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు పార్టీ సీనియర్ నాయకులను సమన్వయకర్తలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.
సమన్వయకర్తల బాధ్యతలివే..
క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఇన్‌ఛార్జ్‌ల కర్తవ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించి, గెలుపు గుర్రాలను గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ నివేదికలను అధిష్టానానికి అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉండి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని కేటీఆర్ సూచించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇన్‌ఛార్జ్‌లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాలను ఇన్‌ఛార్జ్‌లు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/rahul-gandhi-sensational-comments-on-ec/
ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, కొత్త జిల్లాల రద్దు వంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలని చూస్తోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో అదే ఉత్సాహంతో పురపోరులో కూడా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది.

