Harish Rao Released from Shamshabad PS: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమే అని జోస్యం చెప్పారు. శంషాబాద్ పీఎస్ నుంచి పోలీసులు హరీశ్‌రావును విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/top-stories/brs-mla-harish-rao-house-arrest/
వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు సోమవారం మధ్యాహ్నం సంఘీభావం తెలిపేందుకు పరిగి వెళ్తున్న హరీశ్‌రావును, ఇతర బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అప్పా (TSPA) జంక్షన్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు ఉదయం ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసం వద్దే పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు.
ఈ క్రమంలో పరిగి వెళ్తుండగా హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రైతుల పక్షాన తమ పోరాటం ఆపబోమని ఈ సందర్భంగా హరీశ్ రావు స్పష్టం చేశారు.

