MLA KTR: మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా బిల్లు అమలులో కేంద్రం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరిని ఆయన తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, బిల్లును అమలు చేయకుండా డీలిమిటేషన్ సాకుతో కాలయాపన చేయడం సరికాదని అన్నారు.
పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెడుతున్న బిల్లులో స్పష్టత లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి అస్పష్టమైన నిబంధనలు పెడుతున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. “దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి రాష్ట్రాలకు సీట్ల పెంపులో అన్యాయం జరిగితే సహించేది లేదు.
ప్రస్తుతం పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం సీట్ల వాటాను అలాగే కొనసాగించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను కేటాయించి, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి విభజన రాజకీయాలు వదిలేసి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఏ ప్రయత్నానైనా అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.

