BRS objection on Kavitha TRS party : తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ (TRS) అనే మూడక్షరాలు కేవలం ఒక పదం కాదు.. అదొక సునామీ. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న ఆ పేరు ఇప్పుడు మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర కాక రేపుతోంది. జాతీయ రాజకీయాల కోసం పేరు మార్చుకుని ‘బీఆర్ఎస్’ (BRS)గా అవతరించిన కారు పార్టీ.. ఇప్పుడు మళ్లీ ఆ పాత పేరును కాపాడుకునే పనిలో పడిందా? మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్తగా పెట్టిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి, పాత ‘టీఆర్ఎస్’కు మధ్య మొదలైన ఈ అక్షర సమరం వెనుక అసలు కథేంటి? టీఆర్ఎస్ పేరును వేరెవరికీ ఇవ్వొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) వెల్లువెత్తిన 700 ఫిర్యాదుల మతలబు ఏమిటి?
సెంటిమెంట్‌తో ముడిపడిన పేరు.. వదులుకునేది లేదంటున్న బీఆర్ఎస్ : కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అని నామకరణం చేయడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదులు పంపింది. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ‘టీఆర్ఎస్’ అనే పేరు తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో, భావోద్వేగాలతో పెనవేసుకుపోయిందని బీఆర్ఎస్ తమ ఫిర్యాదులో స్పష్టం చేసింది. తాము పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్నప్పటికీ, గ్రామీణ స్థాయిలో ప్రజలు ఇప్పటికీ తమను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. కవిత పార్టీకి ఆ పేరును కేటాయిస్తే ఓటర్లలో తీవ్ర గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, కాబట్టి ఆ అబ్రివియేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచే ఈసీకి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెళ్లడం గమనార్హం.
తెరపైకి కొత్త పేర్లు.. ఈసీకి 700 అభ్యంతరాలు : కవిత పార్టీ పేరు ప్రకటనకు ముందే ఈసీ దగ్గర అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నివేదికల ప్రకారం, టీఆర్ఎస్ పేరు వాడకంపై ఈసీఐకి దాదాపు 700ల వరకు అభ్యంతరాలు అందాయి. ఇందులో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే.. కవిత తన పార్టీ పేరును ప్రకటించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన దయానంద్ మహదేవ్ అనే నేత ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ (ఇదీ టీఆర్ఎస్సే) అనే పేరును రిజిస్టర్ చేయాలని ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పార్టీ పేరుపై అభ్యంతరాల స్వీకరణ కోసం పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. ఆ షోలాపూర్ నేత ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మరోవైపు ‘తెలంగాణ రాజ్య సమితి’ అనే మరో పార్టీ సైతం కవిత పార్టీ పేరును ‘టీఆర్ఎస్’గా వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఏప్రిల్ 25న కవిత ప్రకటన.. తదుపరి అడుగులు ఎటు? : ఏప్రిల్ 25వ తేదీన హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తొలుత తన రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం రికార్డుల పరిశీలనలో రాజకీయ పార్టీగా ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరుతో ప్రాథమిక గుర్తింపునిచ్చింది. అయితే, తుది గుర్తింపు ఇచ్చే క్రమంలో చట్టబద్ధంగా అభ్యంతరాలు స్వీకరించే దశకు చేరుకునే సరికి ఊహించని రీతిలో కవిత పార్టీకి ఈ ఆటంకాలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చట్టబద్ధమైన వివరణ ఇచ్చేందుకు కవిత పార్టీకి చెందిన ప్రతినిధులు, న్యాయవాదులు ప్రస్తుతం సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులను ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? కవిత తన పార్టీ పేరును నిలబెట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

