SIT notices: తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్‌ది మొక్కవోని సంకల్పం: చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్ అని కేటీఆర్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. పదేళ్ల తన పాలనతో రాష్ట్రాన్ని సాగునీటి విప్లవం, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో అగ్రగామిగా నిలిపిన విజనరీ కేసీఆర్ అని కొనియాడారు.
Also read-Phone Tapping : ఫామ్‌హౌస్ గడపకు ‘సిట్’! ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు..
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే: అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ ప్రభుత్వం.. రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి.. ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఏడాది కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విచారణల పేరుతో కేసీఆర్‌ను వేధిస్తున్నారని ఆరోపించారు.
ప్రతీకార రాజకీయం: ఇది న్యాయమైన విచారణ కాదని.. పక్కా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రతీకార చర్య అని కేటీఆర్ ధ్వజమెత్తారు. విచారణల పేరుతో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. నోటీసులతో బెదిరించి తెలంగాణ చరిత్రను లేదా కేసీఆర్ ప్రభావాన్ని చెరిపేయలేరని స్పష్టం చేశారు.
ప్రజలే తీర్పు చెబుతారు: కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని తెలిపారు. తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అన్యాయమైన ఈ పాలనపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఠతెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు” అని ఆయన ట్వీట్ చేశారు.
చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు.
సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు.
సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి…— KTR (@KTRBRS) January 29, 2026

