HomeతెలంగాణChitfund : ఆశ చూపి నిండా ముంచేశారు.. బుద్వేల్‌లో రూ.5 కోట్ల చిట్టీల ఘరానా మోసం!

Chitfund : ఆశ చూపి నిండా ముంచేశారు.. బుద్వేల్‌లో రూ.5 కోట్ల చిట్టీల ఘరానా మోసం!

Budvel Rajendranagar Chit Fund Fraud : రెక్కలముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము… కూతురి పెళ్లి కోసమో, సొంతింటి కల కోసమో, పిల్లల చదువుల కోసమో కూడబెట్టిన కష్టార్జితం… తీరా సమయానికి చేతికందుతుందని ఆశపడితే, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని ఆశల సౌధాన్ని కూల్చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వేల్ వేదికగా చిట్టీల పేరుతో జరిగిన భారీ మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 

- Advertisement -

నమ్మకమే పెట్టుబడి.. ఆశల ఎర: బుద్వేల్ ప్రాంతంలో నివాసముంటున్న అశోక్ అనే వ్యక్తి, స్థానికంగా తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. తొలినాళ్లలో సకాలంలో చిట్టీల సొమ్ము చెల్లిస్తూ ప్రజల్లో అమితమైన నమ్మకాన్ని గెలుచుకున్నాడు. “మా వద్ద చిట్టీలు వేస్తే అధిక లాభాలు వస్తాయి” అని నమ్మబలకడమే కాకుండా, తన భార్యతో కలిసి స్థానిక మహిళలను, వ్యాపారులను ఆకర్షించాడు. వారి తీపి మాటలు నమ్మిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని అశోక్ చేతిలో పెట్టారు.

ఐదు కోట్ల వసూలు – గడువు ముగిసినా దాగిన ముఖం: కొద్దికాలంగా చిట్టీల కాలపరిమితి పూర్తయిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడం ప్రారంభించారు. అయితే, “నేడు ఇస్తాం.. రేపు ఇస్తాం” అంటూ అశోక్ దంపతులు కాలయాపన చేస్తూ వచ్చారు. పలువురికి చెక్కులు ఇచ్చినా, అవి చెల్లకపోవడంతో బాధితుల్లో అనుమానం రెట్టింపయింది. రోజురోజుకూ బాధితుల ఒత్తిడి పెరగడంతో, అశోక్ పథకం ప్రకారం ఇల్లు ఖాళీ చేసేందుకు రాత్రివేళ వ్యూహం రచించాడు.
రాత్రికి రాత్రే కన్నుకప్పి తుర్రు: బాధితులు నిద్రపోతున్న వేళ… రాత్రికి రాత్రే అశోక్ దంపతులు తమ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయాన్నే డబ్బుల కోసం అశోక్ ఇంటికి వచ్చిన బాధితులకు తాళం వేసి ఉండటంతో దిమ్మతిరిగినట్లయింది. చుట్టుపక్కల విచారించగా, రాత్రివేళ సామాన్లతో సహా పరారైనట్లు తెలిసింది. బాధితులు అందించిన సమాచారం ప్రకారం… ఇప్పటివరకు సేకరించిన చిట్టీల మొత్తం రూ. 5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

అశోక్ ఇంటిముందు బాధితుల ఆందోళన: ఆస్తిపాస్తులు, కష్టపడి దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో ఆగ్రహానికి గురైన బాధితులు అశోక్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. బాధితుల్లో మహిళలు, వృద్ధులు అధికంగా ఉన్నారు. “మా రెక్కల కష్టం మమ్మల్ని ముంచేసింది.. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలి” అని పోలీసులను ఆర్తిగా వేడుకుంటున్నారు.

రంగంలోకి పోలీసులు: బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అశోక్ దంపతుల సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News