Telangana Cabinet Meeting in Mulugu Medaram: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడారంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మేడారం వేదికగా సమ్మక్క- సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని వెల్లడించారు.
ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలోని హరిత హోటల్ వేదికగా కేబినెట్ భేటీ అయింది. సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి 2026లో నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం కేబినెట్ ఆమోదించనుంది.
Also Read: https://teluguprabha.net/international-news/uganda-lifts-internet-ban-social-media-remains-blocked/
జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహా జాతర ఏర్పాట్లపై కేబినెట్ సమీక్ష నిర్వహించింది. జాతర కోసం సుమారు రూ. 251 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. మరోవైపు రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేయడానికి ఒక రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా నిధుల విడుదల, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడం వంటి అంశాలపై మంత్రులు చర్చించారు.
భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి మేడారంలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం అమ్మవార్లను దర్శించుకుని, పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/mla-komatireddy-rajagopal-reddy-comments/
అంతకుముందుగా మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి జాతర సందర్భంగా సీసీటీవీ కనెక్టివిటీ, డ్రోన్ నిఘా కార్యకలాపాలను పరిశీలించారు. మేడారం మహాజాతరకు భద్రత, జనసమూహ నిర్వహణ ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. మేడారం జంపన్న వాగు సర్కిల్ వరకు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.

