Thursday, March 12, 2026
HomeతెలంగాణFraud : కమ్మని కబుర్లు.. 'కాల్ మెర్జ్' ఘాతుకాలు: ఆ ఒక్క పొరపాటుతో ఖాతా ఖాళీ!

Fraud : కమ్మని కబుర్లు.. ‘కాల్ మెర్జ్’ ఘాతుకాలు: ఆ ఒక్క పొరపాటుతో ఖాతా ఖాళీ!

Call merging cyber fraud safety : ఫోన్ మోగుతుంది.. అవతల నుంచి చాలా మర్యాదగా మాటలు వినిపిస్తాయి. “నేను బ్యాంక్ మేనేజర్‌ని మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్‌డేట్ అవ్వాలి” అనో, “మీకు భారీ లోన్ మంజూరైంది” అనో ఊరిస్తారు. మధ్యలో ఒక ట్విస్ట్ ఇస్తారు.. “మా సీనియర్ ఆఫీసర్ లైన్లోకి వస్తారు, మీకు వచ్చే రెండో కాల్‌ను ‘మెర్జ్’ చేయండి” అని కోరుతారు. వారు చెప్పినట్లు మీరు ఆ ఒక్క బటన్ నొక్కారా.. ఇక మీ కష్టార్జితం ఆవిరవ్వడానికి క్షణాలు చాలు! టెక్స్ట్ మెసేజ్ రాకపోయినా, మీరు ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ ఎలా ఖాళీ అవుతుంది? అపరమత్తంగా లేకపోతే “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు” అవుతుందని సైబర్ నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఈ ‘కాల్ మెర్జింగ్’ వ్యూహం వెనుక ఉన్న అసలు కిటుకు ఏమిటి?

- Advertisement -

కాల్ మెర్జింగ్ స్కామ్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పాత పద్ధతులను వదిలి, టెక్నాలజీని ఆయుధంగా మలచుకుంటున్నారు. ఈ కొత్త తరహా మోసం ఎలా జరుగుతుందో గమనించండి:
నమ్మబలికే మాటలు: ముందుగా స్కామర్లు మీకు ఫోన్ చేసి బ్యాంక్ అధికారిగానో, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గానో పరిచయం చేసుకుంటారు. మీ ఖాతాలో ఏదో సమస్య ఉందని భయపెడతారు లేదా ఆఫర్లతో ఆశపెడతారు.
కాన్ఫరెన్స్ కాల్ ఎర: విచారణలో భాగంగా తమ పైఅధికారి మాట్లాడతారని, ఇప్పుడు మీకు వచ్చే మరో కాల్‌ను ‘మెర్జ్’ లేదా ‘కాన్ఫరెన్స్’ చేయాలని కోరుతారు. మీరు కాల్ మెర్జ్ చేసినప్పుడు, నేరగాడు మరోవైపు మీ బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ యాప్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. అయితే అది టెక్స్ట్ మెసేజ్ రూపంలో కాకుండా, ‘వాయిస్ కాల్’ రూపంలో వస్తుంది.

పరోక్షంగా ఓటీపీ చోరీ: మీరు కాల్ మెర్జ్‌లో ఉన్నందున, ఆ వాయిస్ కాల్‌లో వినిపించే ఓటీపీని అవతలి వైపు ఉన్న నేరగాడు కూడా వినగలుగుతాడు. మీరు నోరు విప్పి ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేకుండానే, వాయిస్ కాల్ ద్వారా వారు ఓటీపీని గ్రహించి నిమిషాల్లో లావాదేవీ పూర్తి చేస్తారు.

నిపుణుల హెచ్చరిక: అప్రమత్తతే రక్ష : “సైబర్ నేరగాళ్లు గొంగళిలో పురుగుల్లా పొంచి ఉంటారు. కాల్ మెర్జ్ చేయమని ఎవరైనా అడిగితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలి” అని సైబర్ క్రైమ్ నిపుణులు రూపేష్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎప్పుడూ కాన్ఫరెన్స్ కాల్స్ చేయమని కోరవని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వాట్సాప్ లేదా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో “ఆచి తూచి” వ్యవహరించాలి.

మోసపోతే ఏం చేయాలి : ఒకవేళ మీరు పొరపాటున ఇలాంటి మోసానికి గురైతే, కాలయాపన చేయకుండా వెంటనే ఈ చర్యలు తీసుకోండి. తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. నగదు బదిలీ అయిన మొదటి ఒకటి రెండు గంటల్లో ఫిర్యాదు చేస్తే, ఆ సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News