Car driver’s son becomes software CEO : చదువుకు పేదరికం అడ్డుకాదని, పట్టుదల ఉంటే ఏ శిఖరాన్నయినా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి పెరిగిన ఓ సామాన్య యువకుడు.. అంకితభావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ స్థాయికి చేరుకున్నాడు. కేవలం ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ, అన్నదాతల కష్టాలు తీర్చేందుకు ఏఐ (కృత్రిమ మేధస్సు) సాంకేతికతను రంగంలోకి దించాడు.
అమెరికా కల నుంచి హైదరాబాద్ ఐటీ దిశగా : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కుంజా రాఘవులు ఐటీడీఏ పీఓ వద్ద కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడే కుంజా రాము ప్రాథమిక విద్యను భద్రాచలం, పాల్వంచల్లో పూర్తి చేసిన రాము.. సత్తుపల్లిలో ఇంజినీరింగ్ అభ్యసించారు. చదువు పూర్తయ్యాక ఉపాధి వెతుక్కుంటూ అమెరికా వెళ్లి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేశారు. విదేశాల్లో మెరుగైన జీవితం ఉన్నప్పటికీ, సొంత గడ్డపై ఏదైనా సాధించాలనే తపనతో రాము హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో పని చేసి అనుభవం సంపాదించిన తర్వాత, 2016లో కేవలం రూ.50 లక్షల ప్రాథమిక పెట్టుబడితో ‘ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్’ (E-Cart Soft Labs) ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి శ్రీకారం చుట్టారు.
వ్యాపార సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు : మార్కెట్లో కొత్తగా అడుగుపెడుతున్న అంకుర సంస్థలు (Startups), చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (MSMEs) ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లను రాము కంపెనీ లోతుగా విశ్లేషించింది. వాటికి తగినట్లుగా డిజిటల్ మార్పులను తెస్తూ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అందించింది. ఫలితంగా అనతికాలంలోనే సంస్థ పుంజుకుంది. ప్రస్తుతం ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్ వార్షిక లావాదేవీలు సుమారు రూ. 10 కోట్ల వరకు సాగుతుండగా, దాదాపు 15 మంది నిపుణులకు ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది.
అన్నదాతల కోసం ‘ఆగ్రోస్ నెక్సస్’ ఏఐ ఎకో సిస్టమ్ : కొవిడ్ మహమ్మారి సృష్టించిన మార్పుల తర్వాత సమాజంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో నాణ్యమైన, రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులు వినియోగదారులకు చేరాలనే ఉద్దేశంతో రాము ‘ఆగ్రోస్ నెక్సస్’ పేరుతో ఏఐ ఆధారిత అగ్రి-టెక్ ఎకో సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా రైతులు తాము పండించిన పంటలను దళారీ ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం లభిస్తోంది. వినియోగదారులకు ఎంత ధాన్యం లేదా పంట ఉత్పత్తులు కావాలో ముందే స్పష్టం చేసి, రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నారు. పంట కోతకు రాగానే కొనుగోలుదారులు నేరుగా వచ్చి ఉత్పత్తులను తీసుకోవడానికి ఈ వేదిక చక్కటి మార్గమైంది.
‘ఉత్తమ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ’గా గుర్తింపు : వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్ ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైమ్ టైకూన్ మీడియా సంస్థ ‘తెలంగాణ గ్లోబల్ ఎలైట్-2026’ అవార్డును ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన వైభవంగా వేడుకలో ప్రముఖ సినీ నటి ఆదా శర్మ చేతుల మీదుగా సీఈఓ కుంజా రాము ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెస్తామని రాము ధీమా వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ ఇంట పుట్టినా, పట్టుదలతో నేడు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన కుంజా రాము ప్రయాణం నేటి యువతకు నిజంగా ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.

