HomeతెలంగాణCS Sanjay Jaju: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ముమ్మరం.. సీఎస్ సమీక్ష

CS Sanjay Jaju: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ముమ్మరం.. సీఎస్ సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (తెలుగు ప్రభ): తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ–తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026’ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్.. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు, సీఈఓలు, సీఏక్స్ఓలు, దౌత్యవేత్తలను పెద్ద సంఖ్యలో సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు. ప్రముఖులకు ఈ – మెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానాలు పంపే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేయడంతో పాటు, ఆహ్వానాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

- Advertisement -

కీలక రంగాలపై ప్రదర్శన

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచస్థాయిలో ప్రదర్శించడంతో పాటు, తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కీలక రంగాలను సమ్మిట్‌లో సమర్థవంతంగా ప్రదర్శించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీతో పాటు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, మౌలిక వసతులు, ఆవిష్కరణల రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. సమయపాలనతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.  సమావేశంలో సీనియర్ అధికారులు కృష్ణ ఆదిత్య, అజిత్ రెడ్డి, అనుదీప్ దురిశెట్టి, నిఖిల్ చక్రవర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News