CM Revanth about PM Narendra Modi: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు వేగవంతం చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని, ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మహారాష్ట్ర సీఎంతో ఆయన మాట్లాడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. పలు అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రచించినట్లు సీఎం ఇటీవల వెల్లడించారు. సుమారు 100 టీఎంసీల నీటిని నిల్వ చేసి, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, ఆ రాష్ట్ర అభ్యంతరాలను తొలగించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోనున్న మహారాష్ట్ర రైతులకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/bjp-chief-about-pocso-case-against-bandi-bhagirath/
ఇక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో, ఇంటర్మీడియట్ బోర్డు విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తూ, ఈ ఏడాది అడ్మిషన్లు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో విలీనంపై ఉన్న సాంకేతిక సవాళ్లను అధ్యయనం చేయడం, పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాత ఇంటర్ విలీనంపై నిర్ణయం తీసుకుంటామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర పరిణామామలు చేటుచేసుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి తమతో కలవాలని మోదీ సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రేవంత్.. ప్రధాని పిలుపును స్వాగతిస్తున్నామని.. ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ తన రాజకీయ శత్రువులేనని ఆయన స్పష్టం చేశారు. తన పోరాటం ఇద్దరితోనూ ఉంటుందని వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/cm-vijay-meets-dmk-chief-stalin-in-chennai/
‘ప్రధాని మోదీ మాటలను ఎవరికి నచ్చనట్లు వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే సీఎం అయ్యాను. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని మోదీ అన్నారు. నన్ను కాదు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపైన మేం చర్చించాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు నాకు అభ్యంతరం లేదు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తాం. పార్టీలు, ఐడియాలజీ వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. ఇప్పటికే ఎన్నో సార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదు. రెండు గంటలు సమయమిస్తే ప్రభుత్వ ప్రణాళికలు ప్రధానికి వివరిస్తా.’- సీఎం రేవంత్

