CM Revanth Comments on NEET paper leak: నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ రద్దుతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పరీక్షల విశ్వసనీయతను కాపాడాలని సూచించారు. పేపర్లు లీక్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లీక్ చేసినోళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, పేపర్ లీకేజీపై కేంద్రం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వైఫల్యాలు, ద్రోహం, వ్యవస్థీకృత అవినీతి ఈ మూడింటిలోనూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్పష్టమైన సారూప్యతలు కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read: https://teluguprabha.net/international-news/vaccine-for-hanta-virus/
పారదర్శకంగా విచారణ జరపాలి.. కఠినంగా శిక్షించాలి..
ఇంకా ఆయన మాట్లాడుతూ “మే 3న దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సుమారు 22 లక్షల 79 వేల మంది హాజరయ్యారు. ఎన్నో ఆశలతో పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు.. పేపర్ లీక్‌లు, పరీక్షా ప్రక్రియలో జరిగిన తీవ్రమైన అవకతవకల వల్ల అంధకారంగా మారింది. ఈ పేపర్ లీక్‌ల వెనుక, అవినీతి వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా.. ఏ నెట్‌వర్క్‌లు ఉన్నా.. వారిని అస్సలు వదిలిపెట్టొద్దు.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ సంక్షోభంలో చిక్కుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వ్యవస్థాగత వైఫల్యాల వల్ల అమాయక విద్యార్థులు పదేపదే బలి కాకూడదు. అందుకే, నీట్ పేపర్ లీకేజీపై పారదర్శకమైన విచారణ జరపాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ పరీక్షల ఏజెన్సీని డిమాండ్ చేస్తున్నాము. నీట్ పరీక్ష కోసం విద్యార్థులు సంవత్సరాలుగా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మానసిక ఒత్తిడిని భరిస్తారు. పోటీ పరీక్షలు అనేవి ఆందోళనకు చిరునామా కాకూడదు. అవి ప్రతిభకు, అవకాశాలకు సాధనాలుగా మారాలి.” అని వ్యాఖ్యానించారు.

