CM Revanth deadline to ministers and MLAs: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేస్తూ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ నిధుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా.. వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Iran: ఇరాన్‌లో పెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు.. కారణమేంటో తెలుసా?

