CM Revanth Reddy approves Basara Master Plan: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల విషయంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తరహాలో ఆంక్షలు విధిస్తూ ఆలయాల పరిసరాల్లో రాజకీయ జెండాలు, సభలకు నిషేధం విధించారు. ఆలయ పరిసరాల్లో కేవలం ఈవీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని.. VIP వాహనాలు కూడా బయటే పార్కింగ్ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థాన అభివృద్ధికి సంబంధించి రూ. 225 కోట్ల భారీ మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన రేవంత్.. ఏప్రిల్ 6న ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అమలు చేయాల్సిన ఆంక్షలు, నిబంధనలను ముఖ్యమంత్రి వివరించారు. ఆలయ పవిత్రతను కాపాడటానికి కఠినమైన నిబంధనలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తిరుమల తరహాలో ఆలయ ప్రాంగణాల్లో ఎలాంటి రాజకీయ సమావేశాలు లేదా కార్యకలాపాలకు తావు ఉండకూడదు. ఆలయ పరిసరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలి. ప్రముఖుల వాహనాలైనా సరే ఆలయ ప్రాంగణం వెలుపలే నిలిపివేయాలి. లోపలికి వెళ్లడానికి ఈవీలనే ఉపయోగించాలి. ఆలయాల పునర్నిర్మాణం లేదా అభివృద్ధి పనులు పూర్తిగా సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఉండాలి. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకూడదు. – అని సీఎం రేవంత్ వెల్లడించారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు, పార్కింగ్ స్థలాల్లో సోలార్ రూఫ్ టాప్‌లు, అత్యవసర వైద్య సేవల కోసం హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. మరోవైపు యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాలకు స్వయంప్రతిపత్తి కలిగిన బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

