CM Revanth Reddy Foot Ball Championship: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన 74వ ‘బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్’ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో విజేత సీఐఎస్‌ఎఫ్ జట్టుతో పాటు రన్నరప్‌కు ట్రోఫీని అందజేశారు. అంతేకాకుండా ఫుట్‌బాల్ ఆడి ఆకట్టుకున్నారు. మైదానంలోకి దిగి ఒక గోల్ కూడా కొట్టి తన క్రీడాభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణను ముఖ్యమంత్రి అభినందించారు.
క్రీడా సదుపాయాల కల్పనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒలింపిక్స్ గెలుపులో చాలా చిన్న దేశాల కంటే మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో యువతకు సరైన క్రీడా సదుపాయాలు లేవని.. దీనిపై ఇటీవల అధ్యయనం కోసం దక్షిణ కొరియాలో పర్యటించినట్లు చెప్పారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని.. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఒలింపిక్స్‌లోనూ, క్రికెట్‌లోనూ సత్తా చాటిన పలువురు క్రీడాకారులకు భారీ నజరానాతో ఇంటి స్థలం, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి సత్కరించినట్లు గుర్తు చేశారు.

అయితే కొందరు యువత మత్తు బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ క్రీడల్లో రాణించలేకపోతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని.. హైదరాబాద్‌లోనూ మాదకద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా ఉందని వెల్లడించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌ను కట్టడిని చేసేందుకు హైదరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని వివరించారు.
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించినందుకు రేవంత్ వారిని అభినందించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్పోర్ట్స్ ఫ్లాగ్‌ను ఐబీ స్పెషల్ డైరెక్టర్ సప్నా తివారీకి అందజేసి, ఛాంపియన్‌షిప్ అధికారికంగా ముగిసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, డీజీపీ శివధర్ రెడ్డి, సాట్ ఛైర్మన్ శివ సేనా రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

