CM Revanth Reddy Basara Temple: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ. 225 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. శృంగేరి పీఠం ఆమోదంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ పునర్నిర్మాణం జరగనుంది. గోదావరి పుష్కరాల సమయానికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు సీఎం తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana/30-maoists-surrender-before-telangana-police-along-with-keshalu/

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నియమనిబంధనలు తీసుకురావాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. బాసర క్షేత్రం అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన ముఖ్యమంత్రి.. ఈ రోజు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ఈ క్షేత్రాన్ని రూపుదిద్దనున్నారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి విశేషాలను పరిశీలిస్తే..

బాసర ఆలయ ప్రాంగణంలో 9 అంతస్తుల రాజగోపురం, ఈశాన్య దిశలో కోనేరు, ధ్యాన మందిరాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగులుగా ఉన్న ఈ ఆలయ విస్తీర్ణాన్ని 62,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. భక్తుల కోసం క్యూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రాలు, మెరుగైన రహదారులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రాంగణంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భూమి పూజకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన మనవడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం ఆదిలాబాద్‌లో పిప్రిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

